కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు.. నాయకులూ పోటీకి ‘సై’ అన్నారు.! అధినేత పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్ ఇంకేముంటుంది.? కార్యకర్తలు, నాయకుల కోరికని మన్నించాలి కదా.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిందదే.!
ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత శ్రద్ధగానే పాల్గొన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలూ నిర్వహించారు. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, జనసైనికులు కూడా బాగానే కష్టపడ్డారు. పోటీ చేసిన అభ్యర్థుల కష్టాన్నీ తక్కువ చేసి చూడలేం.
కాకపోతే, తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన ఈక్వేషన్లు చివరి నిమిషంలో తెరపైకొచ్చాయి. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అని కాంగ్రెస్ పార్టీ, విచ్చలవిడిగా ఖర్చు చేసింది. అధికారం నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ చేసిన ఖర్చు అంతా ఇంతా కాదు.
‘గెలవకపోతే చావే గతి..’ అంటూ కొందరు అభ్యర్థులు బాహాటంగానే వీడియోలు విడుదల చేసి, ఓటర్లను మాయ చేశారు. చెప్పుుకుంటూ పోతే చాలానే జరిగాయ్.! అలాగని, జనసేన వైఫల్యం చిన్నది కాదు.! జనసైనికులున్నారు సరే, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేయాలి. అభ్యర్థులూ ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోయారు. కానీ, జనసేన పార్టీకి ఇదో అనుభవం.! ముందు ముందు పుంజుకోవడానికి ఇదొక అవకాశం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేతుల్లో వుంది. అలాంటప్పుడు, కనీసం ఓ పాతిక సీట్లలో అయినా తెలంగాణలో వైసీపీ పోటీ చేయాల్సి వుంది. కానీ, ధైర్యం సరిపోలేదు. ఎప్పుడో తెలంగాణ నుంచి పారిపోయిన వైసీపీ, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదుగానీ, భారత్ రాష్ట్ర సమితికి తెరవెనుకాల సహకరించింది. ఇక, షర్మిల స్థాపించిన వైటీపీ సంగతి సరే సరి. ఆ పార్టీ తరఫున అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు, కానీ ఆమె మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.
టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కారణం, చంద్రబాబు అరెస్టు వ్యవహారాలే. ఎలా చూసుకున్నా, జనసేనకు ఓటమి అన్నది అవమానం కానే కాదు.! ఒక్క రూపాయి కూడా ప్రలోభాల కోసం వినియోగించని పార్టీ జనసేన. చెయ్యగలిగీ చేతులెత్తేసిన పార్టీలు వైసీపీ, వైటీపీ.! అవమానం అంటే, ఆ రెండు పార్టీలదే.! సగర్వంగా పోటీ చేసింది.. ఎన్నోకొన్ని ఓట్లను సాధించింది.. మార్పు కోసం గౌరవంగా ప్రయత్నించింది జనసేన.!
ట్రోల్ చేస్తున్న వైసీపీ, తమ పార్టీ పలయానవాదాన్ని ఒక్కసారి తలచుకుని, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటే మంచిది.!