ఇప్పటిదాకా కళ తప్పిన థియేటర్లు మరో వారం నుండి కళకళలాడనున్నాయి. ఇప్పటిదాకా చిన్న సినిమాలతో జనాలు లేక వెలవెలబోయిన థియేటర్లు ఇకపై ఆసక్తికర సినిమాలతో కిటకిటలాడనున్నాయి. డిసెంబర్ 13న వెంకీ మామ రిలీజ్ తో సినిమాల జాతరకు తెరలేవనుంది.
వెంకటేష్, నాగ చైతన్య తొలిసారి కలిసి పూర్తి స్థాయిలో నటిస్తోన్న వెంకీ మామ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నిర్మాతలు కూడా ఈ చిత్ర కథ మీద ఉన్న నమ్మకంతో భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. పోటీగా సినిమాలు ఏవీ లేకపోవడంతో ఒక వారం పాటు వెంకీ మామదే హవా. వెంకటేష్ పుట్టినరోజున విడుదల కానుండడం ఈ చిత్రానికి మరో స్పెషలిటీ.
ఇక డిసెంబర్ 20న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ప్రతిరోజూ పండగే, రూలర్ అదే రోజున విడుదల కానున్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే, ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ తరహాలో తెరకెక్కింది.
ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై భారీ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. కచ్చితంగా హిట్ అవుతుందనే భావన కలిగించింది. ఇక నందమూరి బాలకృష్ణ రూలర్ టీజర్ ద్వారా సినిమా నుండి ఏమేం ఆశించవచ్చో తెలియజేసారు. బాలకృష్ణ గత సినిమాల తరహాలోనే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఇక అదే రోజున కార్తీ నటించిన దొంగ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
రీసెంట్ గా ఖైదీ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ ఇప్పుడు దొంగగా ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. జ్యోతిక, కార్తీ కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం. దృశ్యం సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు.
డిసెంబర్ 25న రెండు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. హిట్టుల్లేక సతమతమవుతున్న రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే డిసెంబర్ 25న విడుదల కానుంది. దిల్ రాజు నిర్మాణం కావడంతో అంచనాలు బాగున్నాయి. ఇక కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా మైత్రి మూవీస్ వారు తెరకెక్కించిన మత్తు వదలరా కూడా ఇదే రోజున రానుంది. టీజర్ తో సరైన అంచనాలను క్రియేట్ చేసింది మత్తు వదలరా. ఇలా రానున్న రోజుల్లో ప్రేక్షకులకు సినిమా జాతర రానుంది.
