‘బెల్లం శ్రీదేవి’తో మెగా మేనల్లుడు ‘సుప్రీం’ హిట్ కొట్టేశాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో వసూళ్ళ పరంగా ది బెస్ట్ ఫిలిం అంటే అది ‘సుప్రీం’ మాత్రమే. ఆ సినిమాతోనే ఒక్కసారిగా తన మార్కెట్ రేంజ్‌ని పాతిక కోట్లకు పెంచేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సుప్రీం’ సినిమాకి అన్నీ అలా కలిసొచ్చేశాయ్. బెల్లం శ్రీదేవిగా రాశి ఖన్నా, ట్యాక్సీ డ్రైవర్ పాత్రలో సాయి ధరమ్ తేజ్.. ఆ సినిమాతో సూపర్బ్ విక్టరీ అందుకున్నారు. ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి సాయి ధరమ్ తేజ్‌కి.
ఇప్పటిదాకా ‘సుప్రీం’ విజయాన్ని తిరగరాయలేకపోయిన ఈ మెగా మేనల్లుడు, మళ్ళీ సక్సెస్ కోసం బెల్లం శ్రీదేవి.. అదేనండీ, రాశి ఖన్నానే నమ్ముకున్నట్టున్నాడు. మారుతి దర్శకత్వంలో తాను చేయనున్న కొత్త సినిమా కోసం రాశి ఖన్నా పేరుని ఫైనల్ చేశాడు మారుతి. నిజానికి, రాశి ఖన్నా పేరు తెరపైకి రావడం వెనుక అసలు కారణం దర్శకుడు మారుతి అట. కానీ, తేజూనే బెల్లం శ్రీదేవిని ఎంపిక చేశాడనే ప్రచారం తెరపైకొచ్చింది.
సరే, కాంబినేషన్లు అన్నిసార్లూ సక్సెస్ అయిపోవు. అలాగని, సక్సెస్ అవకూడదన్న రూల్ కూడా లేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలతో సాయి ధరమ్ తేజ్ – రెజినా కస్సాండ్రా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోలేదా.? మళ్ళీ, ఇప్పుడు ఆ సక్సెస్ ఫార్ములా సాయి ధరమ్ తేజ్ – రాశి ఖన్నాలకు వర్కవుట్ అవుతుందేమో. ఈ రోజే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ‘ప్రతి రోజూ పండగే’ అనే టైటిల్‌ని ఈ సినిమా కోసం ఖరారు చేశారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా అవకాశం వుందట. ఓ యంగ్ అండ్ బబ్లీ బ్యూటీని ఆ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోపక్క, మారుతితో సినిమా కోసం ఇప్పటికే కసరత్తులు చేసి ఒళ్ళు తగ్గించిన సాయి ధరమ్ తేజ్ కొంచెం ఫిట్‌గానే కన్పిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో కన్పించబోతున్నాడన్న ప్రచారం జరుగుతున్నా అదెంత నిజమో ఇంకా తెలియాల్సి వుంది. మరోపక్క, సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో మళ్ళీ ఓ రీమిక్స్ చేయాలని అనుకుంటున్నాడట. అది కూడా చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్ అట. నిజమేనా తేజూ.!