మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే కన్నడ బ్యూటీ రష్మిక మండన్నాని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే, రష్మిక విషయంలో మొదటినుంచీ కొంత గందరగోళం కన్పిస్తోంది. చివరికి ఆమె పేరు ఖరారైనా, తాజా గాసిప్స్ ప్రకారం హీరోయిన్ విషయంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ టీమ్ అంత హ్యాపీగా లేదన్న ప్రచారం జరుగుతోంది. రష్మిక ప్లేస్‌లో ఇంకో హీరోయిన్‌ని ఖరారు చేస్తారనే గాసిప్ సినీ వర్గాల్లో సర్క్యులేట్ అవుతుండడం గమనార్హం.
అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత కారణంగా ఇంకో హీరోయిన్‌ని ఎంపిక చేయడమంటే చిన్న విషయం కాదు. ఏ ఆప్షన్ లేకపోవడంతోనే వున్న హీరోయిన్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది పెద్ద హీరోలు సైతం. మరోపక్క, రష్మిక ప్లేస్‌లో కియారా అద్వానీ అయితే ఎలా వుంటుందన్న చర్చ ‘సరిలేరు నీకెవ్వరూ’ టీమ్‌లో జరుగుతోందట. కియారా అద్వానీ గతంలో మహేష్‌తో ‘భరత్ అనే నేను’ సినిమా చేసి హిట్ కొట్టింది. ఆమెకి అదే తొలి తెలుగు సినిమా. అయితే రెండో సినిమా ‘వినయ విధేయ రామ’తో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకుని, దాదాపుగా టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసింది.
ఇదిలా వుంటే, కియారా అద్వానీ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా వుంది. దాంతో, పలు సినిమాల కోసం ఆమె పేరు విన్పిస్తున్నా, ‘నేను చెయ్యలేను మొర్రో’ అనేస్తోందట. అదే మహేష్ నుంచి ఆఫర్ వస్తే మాత్రం బహుశా కియారా కాదనే అవకాశం వుండకపోవచ్చు. ఇదిలా వుంటే, రష్మిక విషయంలో ఎలాంటి గాసిప్స్‌కి అవకాశం లేదనీ, అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌కీ అవకాశం వుందనీ ఇంకో వాదన కూడా విన్పిస్తోంది. రష్మిక ప్రస్తుతం తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఆమె నటించిన ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు సిద్ధమవుతుండగా, నితిన్ సరసన నటిస్తోన్న ‘భీష్మ’ ఇటీవలే సెట్స్ మీదకు వచ్చింది. తమిళ, కన్నడ సినిమాలతోనూ రష్మిక బిజీగా వుంది.