తండ్రికి తగ్గ తనయుడు కాకుండా తండ్రిని మించే తనయుడిగా ఎదుగుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఏర్పరిచిన ఫ్యాన్ బేస్ ను సంతృప్తిపరుస్తూ, ఆ ఇమేజ్ తాలూకా భారాన్ని మోస్తూ ముందుకు సాగడం మాటలు కాదు.
రామ్ చరణ్ మొదట చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరూ అనుకోలేదు ఈ స్థాయికి వస్తాడని. వారసుల డెబ్యూలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెబ్యూ రామ్ చరణ్ ది. మరి మెగాస్టార్ కొడుకు అంటే ఆ మాత్రం ఉండాలిగా. ఆ సినిమాలోనే చరణ్ తన డ్యాన్స్ మూవ్స్ తో మెగా ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించాడు. మొదటి చిత్రంతోనే తానేం చేయగలడో ఒక షో రీల్ లాగా చూపించేసాడు. ఇక తన రెండో చిత్రం మగధీర తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు రామ్ చరణ్. మగధీర సక్సెస్ లో క్రెడిట్ ఎక్కువగా రాజమౌళికి వెళ్తుందని కొంత మంది వాదించొచ్చు కానీ రామ్ చరణ్ లేకపోతే ఆ స్థాయి విజయం లేదు అనేది నిర్విదాంశం.
అయితే మగధీర తర్వాత చేసిన ఆరెంజ్ పూర్తిగా నిరాశపరిచింది. కానీ ఆరెంజ్ సత్తా ఏంటి అనేది ఈ మధ్య రీ రిలీజ్ అయినప్పుడు కానీ అర్ధం కాలేదు. ఆరెంజ్ ప్లాప్ ఎఫెక్ట్ ఏమో కానీ రామ్ చరణ్ ఆ చిత్రం తర్వాత ఒక మూస ధోరణి లోకి వెళ్ళిపోయాడు. 2013లో బాలీవుడ్ ప్రయత్నంగా చేసిన జంజీర్ దారుణమైన పరాభవాన్ని తీసుకొచ్చింది. అయితే కోల్పోయిన చోటే తిరిగి సంపాదించుకున్నాడు. ట్రోల్ చేసిన వాళ్ళ చేతే పొగిడించుకున్నాడు. అది రామ్ చరణ్ సత్తా అంటే.
తన కెరీర్ ఒక మూసలోకి వెళ్తోందని గమనించిన చరణ్, తనను తానే ఛాలెంజ్ చేసుకుంటూ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చేసాడు చరణ్. సరిగ్గా మాటలు వినపడని చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటన గురించి ఎంత పొగిడినా తక్కువే. రంగస్థలంలోని తన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం కైవసం చేసుకున్నాడు. నటుడిగా తన స్థాయిని ప్రశ్నించిన వాళ్లందరికీ ఒకే సినిమాతో సమాధానం చెప్పాడు. అప్పటిదాకా ఎత్తిన వేళ్ళు అన్నీ రంగస్థలం అనే ఒక్క సినిమాతో ముడుచుకున్నాయి.
రంగస్థలం తర్వాత దాన్ని తలదన్నే సినిమా చేయాలి అన్న చరణ్ ఆలోచనకు రాజమౌళి మేధస్సు తోడైంది. మధ్యలో వినయ విధేయ రామ డిజాస్టర్ పడింది. అయితే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రకటించినప్పుడు కొంత మంది సందేహపడ్డారు. ఎన్టీఆర్ తో చరణ్ సరిసమానంగా చేయగలడా లేదా అని. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ సూపర్బ్ అనే చెప్పాలి. కొన్ని చోట్ల ఎన్టీఆర్ ను పూర్తిగా డామినేట్ చేయగలిగాడు కూడా. రంగస్థలం తర్వాత కూడా రామ్ చరణ్ నటనపై ఎవరికైనా అనుమానాలు ఉంటె దానికి చెంపపెట్టు సమాధానం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం సాధించిన గ్లోబల్ విజయంతో అంతర్జాతీయ వేదికలపై కూడా రామ్ చరణ్ మెరిశాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
స్వయంగా చిరంజీవి అభిమానులే “అన్నయ్యా, మిమ్మల్ని దాటేశాడు” అని అన్నారంటే రామ్ చరణ్ ఏ స్థాయిలో ఎదిగాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 2007లో చిరుత విడుదలైంది. అంటే సరిగ్గా 16 సంవత్సరాలు. ఈ 16 ఏళ్ళల్లో రామ్ చరణ్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసాడు. ప్రశంసలు, అవమానాలు పడ్డాడు. అయితే పడిన లేచిన కెరటంలా, బూడిద నుండి తిరిగి లేచిన ఫీనిక్స్ లా రామ్ చరణ్ ఎదిగిన తీరు ప్రశంసనీయం. ఆన్ స్క్రీన్ కంటే కూడా ఆఫ్ స్క్రీన్ తన ప్రవర్తనతో రామ్ చరణ్ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్నాడు.
ఇలాగే రామ్ చరణ్ తన కెరీర్ లో మరిన్ని ఎత్తులకు ఎదగాలని, ఎవరూ అందుకోని ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం.