‘మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు’ ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా ఆయన్ని అలాగే అభివర్ణిస్తూ సీఎం ప్రసంగించారు. కట్ చేస్తే.. ఆ సౌమ్యుడు పోలింగ్ రోజు విధ్వంసకాండ కు తెర తీశాడు. పోలీసు కేసు అవుతుందని ముందే గ్రహించిన ఆ మంచివాడు హైదరాబాద్ కి చెక్కేశాడు. ఆ ఘటనకి సంబంధించిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. రెంటచింతల మండలం పరిధిలోని పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించి కౌంటర్లోకి దూరి ఈవీఎంని పగలగొట్టారు. అడ్డొచ్చిన ఏజెంట్లను బెదిరిస్తూ వీరంగం సృష్టించారు.
మాచర్లలో ఎన్నికల రోజు జరిగిన విధ్వంసం పై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే, ఎప్పటిలాగే వైసీపీ నాయకులు తమ ఎమ్మెల్యే ని వెనకేసుకొస్తున్నారు. తెలుగుదేశం నేతలు రిగ్గింగ్ చేశారన్న సమాచారం అందడంతోనే పిన్నెల్లి ఈవీఎంని ధ్వంసం చేశారని చెబుతున్నారు. నిజానికి అలాంటి ఘటన నిజంగా జరిగే ఉంటే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఊరుకుంటుందా?. రిగ్గింగ్ జరుగుతున్న విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా ఏకరువు పెట్టేది. పోనీ బాధ్యతాయుతంగా చేయాల్సిన పని ఏంటి? రిగ్గింగ్ జరుగుతున్న విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. ఇవేవీ చేయకుండా.. ఓడిపోతామన్న ఫ్రస్టేషన్ లోనే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే
ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి పై పది సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఏడేళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఈసీ తెలిపింది. విదేశాలకు పారిపోకుండా ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కేసు నమోదు అవ్వడంతో ఆయన హైదరాబాద్ లో దాక్కున్నారన్న సమాచారం అందడంతో ఏపీ పోలీసులు గాలింపు చేపట్టారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిధిలోని ఇందూ విల్లాస్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పిన్నెల్లి ఇంటి నుంచి కారు బయటకు రావడంతో దాన్ని పోలీసులు అనుసరించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా చేసుకుని జాతీయ రహదారి వెంబడి కారును ఫాలో అయ్యారు. నగర శివారులోని రుద్రారం వద్ద కారు ఆగిపోయింది. అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో అవాక్కయ్యారు. డ్రైవర్, గన్ మెన్ లని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఎమ్మెల్యే ఫోన్ తమ వద్దే వదిలి మరో కారులో హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపారు. అయితే మంగళవారం ఈవీఎం ధ్వంసం చేసిన విషయం బయటకు రావడంతో ఎమ్మెల్యే తన సోదరుడితో కలిసి హైదరాబాద్ నుంచి తమిళనాడుకు పారిపోయి ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే సమీప బంధువుల ఇళ్లలో గాలిస్తున్నారు.
రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఈవీఎం ధ్వంసం చేసిన విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. అదో సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. ఆధారాలన్నీ పక్కాగా ఉండటంతో ఆయనపై 10 తీవ్రమైన సెక్షన్ల తో కేసులు నమోదు చేసింది. ఈ సెక్షన్ల ప్రకారం ఆయనకు గరిష్టం గా ఏడేళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. చట్ట నిబంధనల ప్రకారం రెండేళ్లపాటు జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధి ఆరేళ్లపాటు ఎన్నికలకు అనర్హులవుతారు. దీంతో ఆయన రాజకీయ జీవితం అగమ్య గోచరంగా మారింది.