ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల మధ్యమ విద్య అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంత కాలం నుండి పోరాడుతున్న విషయం తెల్సిందే. ట్విట్టర్ లో రోజూ అధికార పక్షాన్ని ఎండగడుతున్న పవన్, నేడు తిరుపతిలో జరిగిన తెలుగు వైభవం ఆత్మీయ సదస్సులో పాల్గొన్నాడు. ఈ సమావేశంలో తెలుగు భాష ఉనికిపై ఆందోళన వ్యక్తం చేసాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ప్రమాదంలో ఉన్న తెలుగు భాష, ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తే పూర్తిగా చచ్చిపోతుందని వ్యాఖ్యానించాడు.
అయితే రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరనుండి సినిమా వాళ్లపై ఒక్క మాట కూడా విసరని పవన్, ఈసారి మాత్రం టాలీవుడ్ నటులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించాడు. టాలీవుడ్ లో తెలుగు భాషపై ఆందోళన వ్యక్తం చేసాడు. హీరోలందరూ తెలుగు వారే అయినప్పటికీ, చాలా మందికి అందులో తెలుగు రాయడం, చదవడం రాదనీ, ఇక హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణమని వ్యాఖ్యానించాడు. తెలుగు సినిమాల్లో పనిచేస్తారు. ఇక్కడి నుండి డబ్బులు కావాలి, కానీ తెలుగు భాష మాత్రం అక్కర్లేదు అని విమర్శలు చేసాడు.
పవన్ ఈ స్థాయిలో విమర్శలు చేయడంతో పరిశ్రమలో ఈ విషయంపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ విషయమై ఇంకా కన్ఫ్యూజన్ అలాగే నిలిచి ఉంది. పింక్ రీమేక్ ద్వారా పవన్ ను మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావాలన్న దిల్ రాజు ప్రయత్నాలు సఫలమైనట్లు కనిపించినా ప్రస్తుతం అవేం జరుగుతున్నట్లు కనిపించట్లేదు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
