Hollywood: హాలీవుడ్ (Hollywood) లో సమ్మె సైరన్ మోగింది. దీంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ విడుదల ఆలస్యం కానుంది. హాలీవుడ్ నటీనటులు, రచయితలు కలసి చేస్తున్న సమ్మె కావడంతో సినీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సరిగ్గా 63ఏళ్ల క్రితం.. 1960లో ప్రముఖ నటుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో ఈ రెండు సంఘాలు కలిసి సమ్మె చేపట్టాయి. మళ్లీ ఇన్నేళ్లకు ఈ రెండు సంఘాలు కలిసి సమ్మెకు వెళ్లడం చర్చనీయాంశమైంది.
భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి నుంచి ఈ సమ్మె మొదలైంది. ఇప్పటికే 11 వారాల క్రితమే సమ్మె మొదలుపెట్టిన రచయితలకు.. నిర్మాణ సంస్థలతో జరిపిన చర్చలు సక్సెస్ కాకపోవడంతో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ వీరితో జత కలసి సమ్మెకు దిగాయి. ఈ గిల్డ్ కు 1,60,000 మంది నటీనటులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పొంచి ఉన్న ప్రమాదం, తక్కువ జీతాలపై వీరు సమ్మెకు దిగారు.