గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు చేయగా 103 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. ఇందులో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ (Artist Hema) కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. అయితే, రేవ్ పార్టీ వ్యవహారంలో తన పేరు బయటకి వచ్చినప్పటి నుంచి హేమ ఆ వార్తలని ఖండిస్తూనే ఉన్నారు. తాను బెంగుళూరు వెళ్లలేదని హైదరాబాద్ లోనే ఉంటున్నానని వీడియోలు విడుదల చేశారు.
హైదరాబాద్ కి చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే సందర్భంగా ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున డీజే శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రేవ్ పార్టీ గుట్టును బయటపెట్టారు.
ఈ పార్టీలో పాల్గొన్న వారిలో మొత్తం 150 మంది రక్త నమూనాలను సేకరించారు. వారిలో 103 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. డ్రగ్స్ తీసుకున్న వారిలో మరికొందరు తెలుగు నటులు, రాజకీయ ప్రముఖులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారి పేర్లను కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.