Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కేంద్ర ప్రభుత్వం దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’తో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, స్థానికంగా ఉన్న మెగాభిమానులు (ఎన్నారై) ఆధ్వర్యంలో నిర్మాత విశ్వ ప్రసాద్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి విజయాలను కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, సామాజిక సేవలకి గుర్తింపే ఈ అవార్డని వక్తలు అన్నారు.
చిరంజీవి మాటల్లో..
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా నాకు ఇంతటి ఉత్సాహం ఇస్తోంది మీ ప్రేమాభిమానాలే. నాపై మీరు చూపిస్తున్న అభిమానం నన్నెప్పుడూ ముందుకు నడిపిస్తూంటుంది. ఇంతటి ఆదరణ దక్కుతున్న వేళ సంతోషంగా ఉంది. ఇది కదా నిజమైన అవార్డు అనిపిస్తుంది. అభిమానుల కేరింతలే నాకు ఆక్సిజన్. తెరపై నన్నెంత ఆదరిస్తారో.. తెర బయట కూడా నా పిలుపుకు అదే ఉత్సాహంతో స్పందిస్తారు. “పద్మ విభూషణ్” పురస్కారంతో నన్ను గౌరవించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన’ని అన్నారు.
అదే ఎనర్జీ..
డైనమిక్ హీరో.. సుప్రీం హీరో.. తిరుగులేని ‘మెగాస్టార్’. ఇంతై ఇంతింతై వటుడింతై.. అన్నట్టు సాగిన చిరంజీవి ప్రస్థానంలో అభిమానుల పాత్ర కీలకం. ఆ విషయం చిరంజీవి ఎన్నో వేదికలపై మరెన్నో సందర్భాల్లో చెప్పారు. సైరా ప్రీ-రిలీజ్ లో ‘నేను సాధించినవి రెండు.. ఒకటి రామ్ చరణ్.. రెండు అభిమానులు’ అన్నారు. చిరంజీవి బొమ్మే వారికి ఆనందం.. ఆయన చిరునవ్వే వారి బలం. తనను అభిమానించే అభిమానులెందరికో చిరంజీవి ఆండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. కెమెరా ముందు డ్యాన్స్ అంటే చిరంజీవికి ఎంత ఎనర్జీనో.. సమాజ సేవపైనా అంతే ఎనర్జీ. అదే నేడు రెండో అత్యున్నత పురస్కారం అందుకునేలా చేశాయి.
హీరోలకే హీరో..
అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ.. హీరోల్లోనే చిరంజీవికి అభిమానులు ఉంటారనే మాట నిజం. కొత్త తరాన్ని ఆయన ప్రోత్సహించే తీరు.. ఉత్సాహపరిచే మాటలు వారికి బూస్టప్. చిరంజీవి అంతటి వ్యక్తి మెచ్చుకుంటే వారికి ఆదరణ, ప్రజల్లోనూ నమ్మకం. ఇటివలి హనుమాన్ ప్రీ-రిలీజ్ లో ధియేటర్ల లభ్యతపై చిరంజీవి చిత్ర యూనిట్ కి ఇచ్చిన ధైర్యం నూటికి నూరుపాళ్లూ నిజమైంది. ఇదే కదా చిరంజీవి. అందుకే కదా ఆయన చిరంజీవి అనుకోని తెలుగు సినీ ప్రేక్షకులు లేరు. దేశాలు దాటినా.. చిరంజీవిపై తరగని అభిమానాన్నే నేడు అమెరికా ఎన్నారైలు చూపించారు.. చిరంజీవికి పల్లకీలో కూర్చోబెట్టారు.