వావ్.! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా, వ్యక్తిగతంగా స్థాయిని దిగజార్చేసుకునేదాకా వెళ్ళిపోయాయ్.. రాజకీయ నాయకులకి.! ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ మంత్రి.. ఎవరైనాగానీ.. అందరిదీ ఒకటే తీరు.!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా చేసిన విమర్శల నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ వచ్చింది.
అసలు వీళ్ళా ప్రజా ప్రతినిథులు.? వీళ్ళా రాజకీయ నాయకులు.. అసలు వీళ్ళు మనుషులేనా.? అన్నట్టు, ఇరు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులూ తమ స్థాయిని దిగజార్చేసుకుని, రాష్ట్ర రాజకీయాల్ని అవహేళన చేస్తున్నారు. ప్రజల్ని అవమానిస్తున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తాజాగా మీడియా ముందుకొచ్చారు. లోకేష్ అండ్ టీమ్ చేసిన విమర్శల మీద కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చాక పశువుల డాక్టర్ అవలేదనీ, అంతకు ముందే ఆయన పశువుల డాక్టరని సెలవిచ్చారు పేర్ని నాని.
అక్కడితో పేర్ని నాని ఆగలేదు, ‘వైసీపీలోకి వచ్చాక కొడాలి నాని లారీ క్లీనర్ అవలేదు కదా.? వైసీపీలోకి వచ్చాక కప్పులు కడగలేదు కదా.? అంతకు ముందు ఆయనేమీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కదా.! టీడీపీలో వున్నప్పుడు తెలియదా లారీ క్లీనర్ అనీ.. కప్పులు కడిగేటోడనీ..’ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
టీడీపీకి కౌంటర్ ఇచ్చానని పేర్ని నాని అనుకోవచ్చు. కానీ, ఇటు వల్లభనేని వంశీ పరువు తీసేసి, అటు కొడాలి నానిని బజారుకీడ్చేశారు పేర్ని నాని. అదేంటో, ఈ మధ్య పేర్ని నాని ఏం మాట్లాడినా, అది వైసీపీకి చాలా చాలా గట్టిగా తగిలేస్తోంది..!
మొన్నటికి మొన్న, పవన్ కళ్యాణ్ చెప్పుల వ్యవహారంలో, మీడియా ముందు చెప్పులు చూపించి నవ్వులపాలైపోయారు పేర్ని నాని. ‘చెప్పుల దొంగ’గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారాయన. ‘గుడ్డలూడదీసి, కట్ డ్రాయర్తో కొడాలి నానిని రోడ్డు మీదకు లాగుతాం..’ అని నారా లోకేష్ అనడం సమంజసం కాదు. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి, అభ్యంతరకరంగా మాట్లాడటమూ సబబు కాదు.!
కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి. అయినా, ఇలాంటి వార్తల్ని లైవ్ కవర్ చేసేటప్పుడు, మీడియా ప్రతినిథులూ ఒకింత బాధ్యతగా వ్యవహరించాలి. రాతకి సెన్సార్ వుంటుంది.. లైవ్‌కి సెన్సార్ వుండదు కదా.! ‘ఛీ.. వీళ్ళా రాజకీయ నాయకులు.?’ అని ప్రజలు ఇప్పటికే అసహ్యించుకుంటున్నాగానీ.. రాజకీయ నాయకులు మారడంలేదు.!
దేనికోసమీ దిగజారుడుతనం.?