రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని, పంచాయతీల పునర్విభజన విషయంలో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని ఆయన స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థలను బలపరిచే చర్యలను ప్రారంభించామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థలు స్వావలంబనతో పనిచేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రహదారుల విస్తరణతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల సమయంలో చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు, వాటికి తగిన ప్రత్యామ్నాయం కల్పించే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, పచ్చదనాన్ని కాపాడేందుకు సమగ్ర చర్యలు చేపడతామని చెప్పారు.
చెట్ల సంరక్షణ కోసం భవిష్యత్తులో బలమైన చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చెట్లను కేవలం నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కఠినంగా అమలు చేసే చట్టం ద్వారా మాత్రమే పచ్చదనాన్ని కాపాడగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నప్పటికీ వాటి సంరక్షణపై తగిన దృష్టి అవసరమని సభ్యులు సభలో ప్రస్తావించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఇకపై నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నర్సరీల దశ నుంచే ఈ ప్రక్రియను అమలు చేసే విధంగా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. బెంగళూరులోని నర్సరీల్లో అమలవుతున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నామని, మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణను కూడా క్రమంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఎర్రచందనం అమ్మకాల విషయంలో కూడా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గోదాముల్లో ఉన్న ఎర్రచందనం దుంగలకు మెరుగైన ధరలు పొందేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని చెప్పారు. ఈ బృందం అంతర్జాతీయ మార్కెట్ ధరలను పరిశీలిస్తూ దుంగల వేలం నిర్వహించి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, ఉద్యోగులకు ఇచ్చే పదోన్నతులు, అటవీ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై సభలో చర్చ జరిగినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ అంశాలను సభలో ప్రస్తావించిన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా పవన్ కళ్యాణ్ శాసనసభలో సమర్పించారు. పంచాయతీరాజ్ శాఖకు రూ.15,485 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.11,217 కోట్లు, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు రూ.713 కోట్ల బడ్జెట్ గ్రాంట్లను ప్రతిపాదించారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
