చార్లీ చాప్లీన్ మళ్లీ పుట్టాల్సిన సమయం వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఫ్రాన్స్ లో ప్రారంభమైన కేన్స్ చిత్రోత్సవాలను ఉద్దేశించి వర్చువల్ గా ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులకు.. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు ఏమీ తేడా లేదని.. ఇలాంటి సమయంలో చిత్ర పరిశ్రమ ఎలా మౌనంగా ఉంటుందని అన్నారు.
రెండో యుద్ధం సమయంలో చార్లీ చాప్లీన్ ది గ్రేట్ డిక్టేటర్ చిత్రం తీసారని.. నిజమైన నియంతను అంతం చేయలేకపోయినా సినిమా ద్వారా అన్యాయంపై గళమెత్తొచ్చని చార్లీ నిరూపించారని అన్నారు. ఇప్పుడీ సమయంలో మళ్లీ చార్లీ అవసరం వచ్చిందని అన్నారు.
‘మనుషుల మధ్య ధ్వేషం పోతుంది.. నియంతలు మరణిస్తారు.. ప్రజలకు అధికారం వస్తుంద’ని ఆ చిత్రంలోని డైలాగ్ చెప్పారు. దీంతో వేడుకకు వచ్చినవారంతా లేచి నిలబడి హర్షధ్వానాలతో స్వాగతించారు. ఇటివల జరిగిన గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలోనూ ప్రసంగిస్తూ తమకు ప్రపంచం అండగా నిలవాలని జెలెన్ స్కీ కోరారు.