2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు గెలచుకుంది. ఓట్ల శాతం కూడా సింగిల్ డిజిట్ దాటలేదు.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు.! తాను ఓడిపోయిన విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు. ఇందులో దాచుకోవడానికేముంది.?
2024 ఎన్నికలనాటికి పరిస్థితులు ఎలా వుండబోతున్నాయ్.? 175 సీట్లకు 175 సీట్లూ గెలిచేస్తామని అధికార వైసీపీ గట్టిగా చెబుతోంది. అంటే, విపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కబోదన్నమాట. అలాంటప్పుడు టీడీపీ – బీజేపీ – జనసేన కలిసినా వైసీపీకి ఇబ్బంది ఏముంటుంది.? కానీ, వైసీపీ ఇబ్బంది పడుతోంది.
నిజానికి, టీడీపీ విషయంలో వైసీపీకి పెద్దగా సమస్య లేదు. ఆ ‘60-40’ అవగాహన ఏంటన్నది ఆ రెండు పార్టీలకే తెలియాలి. కానీ, ఓ ఖచ్చితమైన అవగాహనతో టీడీపీ విషయంలో వైసీపీ ‘జాకీలేసి లేపే’ వ్యవహారమైతే చేస్తోంది. తేకపోతే, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ‘జనసేన పార్టీ 30 సీట్లు అడుగుతోందట, చంద్రబాబు 15 సీట్లే ఇస్తామంటున్నారట.. ఇది మాకున్న సమాచారం’ అని చెప్పడమేంటి.?
175 సీట్లూ గెలిచేస్తామనే ధీమా వున్న పార్టీకి, ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమేముంటుంది.? కానీ, వైసీపీ చాలా చాలా ఆందోళన చెందుతోంది జనసేన విషయంలో. అందుకే, గత కొద్ది కాలంగా వైసీపీ అధినేత దగ్గర్నుంచి, సోషల్ మీడియా కార్మికుల వరకూ.. జనసేన మీదనే స్పెషల్ ఫోకస్ పెట్టారు.
విశాఖలో పవన్ కళ్యాణ్‌ని హోటల్ రూమ్‌కే పరిమితం చేశారు. కానీ, టీడీపీ సభలకు, కార్యక్రమాలకు మాత్రం పూర్తిగా సహకరిస్తున్నట్లే కనిపిస్తోంది వైసీపీ సర్కారు. ఏదో తప్పదన్నట్టు టీడీపీ మీద నాలుగు విమర్శలు తప్పితే, నిజానికి టీడీపీ పట్ల వైసీపీకి అంత వ్యతిరేకత ఏమీ లేనట్లే వుంది.
జనసేనకు గనుక ఓ పాతిక ముప్ఫయ్ సీట్లు వస్తే.. ప్రజల్లో మార్పు వచ్చేసినట్లే.. ఆ మార్పు రాకూడదన్న భయం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ జనసేన అధికారంలోకి వస్తేనో.? ఇది ఇంకా భయపెడుతోంది వైసీపీని. అందుకే, జనసన ఇమేజ్‌ని తగ్గించడం కోసం ‘చంద్రబాబు దత్త పుత్రుడు’ అంటూ పవన్ కళ్యాణ్ మీద పసలేని విమర్శలు చేస్తున్నారు వైసీపీ అధినేత.
కానీ, నిజానికి చంద్రబాబుకి దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నది వైఎస్ జగన్. చంద్రబాబు అవినీతి మీద పుస్తకాలు ప్రచురించి, ఢిల్లీదాకా వెళ్ళి హంగామా చేసిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆ అవినీతిని వెలికి తీయట్లేదు.? ఇదొక్కటి చాలు టీడీపీకి జగన్ ఎంతలా దత్తపుత్రుడైపోయాడో చెప్పడానికి.. అంటూ సోషల్ మీడియాలోనే కాదు, జన బాహుళ్యంలోనూ చర్చ జరుగుతోంది.
అందుకే, ఆ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం ‘టీడీపీతో జనసేన పొత్తు.. 30 కాదు 15 సీట్లు మాత్రమే ఇస్తామన్నారట..’ అంటూ, సజ్జల మార్కు హైడ్రామాకి తెరలేపారన్నమాట.!