వైసీపీకి పవన్‌ కళ్యాణ్‌ మీద ‘ప్రేమ’ ఎక్కువైపోయింది.!

జనసేనాని ‘సీమ’ దెబ్బ.. వైసీపీకి గట్టిగానే తగిలిందా.?

వున్నపళంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీద ‘ప్రేమ’ ఎక్కువైపోయింది.! వైఎస్సార్సీపీ వాయిస్‌, టీడీపీ విషయంలో సరిపోవడంలేదని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అనుకుంటున్నారా.? లేకపోతే, చంద్రబాబుని విమర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌ ‘సాయం’ ఎందుకు టీడీపీ నేతలు అర్ధిస్తున్నారు.? ఏమో, వైసీపీ నేతలకే తెలియాలి.

అసలు విషయానికొస్తే, టీడీపీ అధినేత చంద్రబాబుకి సంబంధించిన అత్యంత సన్నిహితులపై ఐటీ సోదాలు గత కొద్ది రోజులుగా జరిగిన విషయం విదితమే. ఆ సోదాలకు సంబంధించి 2 వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల్ని ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ అధికారికంగా ధృవీకరించింది కూడా. ఇకనేం, వైఎస్సార్సీపీ పండగ చేసుకుంటోంది. వైసీపీకి సంబంధించిన మంత్రులు, ఇతర ముఖ్య నేతలు చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే హంగామా షురూ అయ్యింది.

ఇక, ఈ వ్యవహారంపై వివిధ ఛానెళ్ళలో చర్చా కార్యక్రమాల సందర్భంగా జనసేన పార్టీ తరఫున కూడా వాయిస్‌ గట్టిగానే విన్పించింది. అటు వైఎస్‌ జగన్‌, ఇటు చంద్రబాబు.. ఇద్దరూ అవినీతి పరులేనని జనసేన తేల్చి చెబుతోంది. బీజేపీ కూడా అదే వాయిస్‌తో నినదిస్తోంది. అయినాగానీ, చంద్రబాబుని విమర్శించడానికి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రావడంలేదు.? అంటూ వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారు.

ఒకరా.? ఇద్దరా.? వైసీపీ నేతలందరి డిమాండూ ఒకటే.. పవన్‌ కళ్యాణ్‌ రావాలి, చంద్రబాబుని విమర్శించేయాలి. ఖచ్చితంగా వస్తారు.. పవన్‌ కళ్యాణ్‌ వస్తే, ఆ తర్వాత సీన్‌ ఎలా వుంటుందో ఊహించుకోవాల్సిన పనిలేదు. ప్రతి శుక్రవారం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎందుకు కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది.? అలా హాజరు కావాల్సిన పరిస్థితిని తప్పించుకునేందుకు ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు.? అన్నది అందరికీ తెలిసిన విషయమే.

వైఎస్‌ జగన్‌ సంగతేంటో సీబీఐ ఎప్పటినుంచో చెబుతూనే వుంది. ఇప్పుడు చంద్రబాబు సంగతి తేల్చడానికి ఐటీ శాఖ సర్వసన్నద్ధమవుతోంది. ఒకర్ని మించి ఇంకొకరు.. పవన్‌ కళ్యాణ్‌ మీడియా ముందుకొస్తే.. ఈ రెండు విషయాలూ ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ఆ ముచ్చట తీర్చుకోవాలని తెగ సంబరపడిపోతోంది వైఎస్సార్సీపీ. ఒక్కడ ఓ విషయం వైసీపీ నేతలు మర్చిపోతున్నారు.. 2 వేల కోట్ల రూపాయలంటూ చంద్రబాబుని ‘దొంగ’గా చిత్రీకరిస్తున్న వైసీపీ నేతలు, దాదాపు 43 వేల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తుల అభియోగాల్ని ఎదుర్కొంటున్న వైఎస్‌ జగన్‌ని కూడా అదే రీతిన ‘గౌరవిస్తుండడం’ హాస్యాస్పదం కాక మరేమిటి.?