బీజేపీతో పొత్తు కోసం.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు.?

బీజేపీ వైపు చూస్తున్న ముగ్గురు వైసీపీ ఎంపీలు.?

భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏమొచ్చింది.? మొన్న ప్రధాని నరేంద్ర మోడీతోనూ, నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోనూ వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వరుసగా భేటీ అవడం వెనుక రాజకీయ కోణాల్ని విస్మరించలేం.

ఈ మధ్యకాలంలో ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా వైఎస్‌ జగన్‌కి దొరకడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, అనూహ్యంగా బీజేపీ పెద్దలు (కేంద్ర ప్రభుత్వ పెద్దలే అయినా..) వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే. బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు నరేంద్ర మోడీ, ఇంకొకరు అమిత్‌ షా.

‘మేం కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగానే వున్నాం..’ అంటూ సాక్షాత్తూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం విశేషమే మరి. రాజధాని అమరావతి విషయంలో మొదట బురద చల్లింది ఈయనగారే. అమరావతిని స్మశానంగా అభివర్ణించిన బొత్స, రాష్ట్రంలో బీభత్సమైన రాజకీయ అలజడిని రేపారు. అదే బొత్స ద్వారా, బీజేపీతో పొత్తు కోసం వైసీపీ వెంపర్లాడుతున్న విషయాన్ని బయటపెట్టించేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

అయితే, బీజేపీ అందుకు సుముఖంగా వుందా.? లేదా.? అన్నదే చర్చ ఇక్కడ. ‘మాకు వైసీపీతో కలవాల్సిన అవసరం లేదు’ అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, ఢిల్లీలో రాజకీయం ఇంకోలా వుంది. ‘మాతో కలవాలంటే కలవొచ్చు.. కానీ, మీ గొంతెమ్మ కోర్కెలు తీర్చబోం..’ అని బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ అధినేతకు తేల్చి చెప్పిందట.

‘దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు కేంద్రానికి షాకిస్తున్నాయి.. ముందు ముందు బీజేపీకి రాజ్యసభలో ఎంపీలు అవసరమవుతారు.. ఆ లెక్కన మా అవసరం బీజేపీకి తప్పక ఏర్పడుతుంది’ అని వైసీపీ భావిస్తోంది. కానీ, ‘అవసరమైతే, ఇతర పార్టీల నుంచి ఎంపీల్ని లాక్కుంటాం.. అంతే తప్ప, ఎవరి గొంతెమ్మ కోర్కెల్నీ తీర్చే పరిస్థితే లేదు’ అని బీజేపీ అగ్రనాయకత్వం లీకులు పంపుతుండడం గమనార్హం.

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు.. ఇలా రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన, చేయాల్సిన విషయాలు చాలానే వున్నాయి. కానీ, వ్యవహారం మాత్రం ఇంకో కోణంలో నడుస్తోంది. ఏమో, ముందు ముందు ఈ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.