వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగంలో పని చేస్తున్న కొందరు, తిరుమలలో మహిళలు తల నీలాలు సమర్పించకూడదంటూ కొత్త సిద్ధాంతానికి తెరలేపారు.
నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల, తిరుమలలో తల నీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆమె, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదల దంపతుల కుమారుడు మార్క్ శంకర్, సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ అగ్ని ప్రమాదం నుంచి కుమారుడు కోలుకుంటే, తిరుపతి వచ్చి, తలనీలాలు సమర్పించుకుంటానని అన్నా కొణిదెల మొక్కుకున్నారు.
మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి చేరుకున్న దరిమిలా, పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల సింగపూర్ నుంచి మార్క్ శంకర్‌ని హైద్రాబాద్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి నేరుగా అన్నా కొణిదెల, తిరుమల చేరుకుని తలనీలాలు సర్పించి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
అయితే, మహిళలు తల నీలాలు సమర్పించకూడదని గరికపాటి నరసింహారావు చెప్పారనీ, ఆ లెక్కన అన్నా కొణిదెల పబ్లిసిటీ స్టంట్ చేశారనీ, ఇదంతా పవన్ కళ్యాణ్ డైవర్షన్ డ్రామా అనీ.. వైసీపీ సోషల్ మీడియా విభాగం, దుష్ప్రచారానికి తెరలేపింది.
తిరుమలలోని కళ్యాణ కట్టలో నిత్యం వేలాది మంది మహిళలు తలనీలాలు సమర్పిస్తుంటారు. బిడ్డల క్షేమం కోసమో, భర్త క్షేమం కోసమో.. మహిళ ఇలా తలనీలాలు సమర్పించడమన్నది అనాదిగా వస్తున్న ఆచారం.
మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా క్షురకులు తిరుమల కళ్యాణకట్టలో పని చేస్తుంటారు కూడా. అలాంటప్పుడు, మహిళలు తలనీలాలు సమర్పించకూడదని అనడమేంటి.? ఆ దిశగా దుష్ప్రచారం చేయడమేంటి.?
హిందూ మత విశ్వాసాల్ని దెబ్బ తీయడం వైసీపీకి ఓ అలవాటుగా మారిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?