ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో బాప్టిజం తీసుకున్నానని చెప్పారట.. అలాగని వైసీపీ తెగ ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ తిరుమల వెళితే, డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందేనన్నది వైసీపీ డిమాండ్.
హోంమంత్రి వంగలపూడి అనిత విషయంలోనూ వైసీపీ ఇదే వాదన వినిపిస్తోంది. ఆ మాటకొస్తే చాలామంది కూటమి నేతల మీద ఈ తరహా డిమాండ్లు పెడుతోంది వైసీపీ. ఇలా చేయడం ద్వారా అసలు వైసీపీ సాధించేది ఏముంటుంది.?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలన్నదానికి స్పష్టమైన అంశాలున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ అనీ, తాను బాప్టిజం తీసుకున్నాకే ఆయన్ని పెళ్ళి చేసుకున్నానని స్వయానా వైఎస్ విజయమ్మ, తాను రాసుకున్న పుస్తకంలో పేర్కొన్నారు.
సో, ఇక్కడ మేటర్ క్లియర్.. వైఎస్ జగన్, పుట్టిందే క్రిస్టియన్‌గా.! సో, ఆయన తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. డిక్లరేషన్ అంటే, అదేమంత ప్రమాదకరమైనది కాదు కదా.! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం వుందని ప్రకటించడమే.! విశ్వాసం లేకపోతే, డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదు.. అసలు తిరుమలకి వెళ్ళకూడదు కూడా.!
పవన్ కళ్యాణ్ విషయంలో, ఇంకొకరి విషయంలోనో.. ‘అన్యమతం’ అన్న ప్రస్తావన లేదు. చట్ట ప్రకారం, వాళ్ళంతా హిందువులే గనుక. నిజానికి, చాలామంది ప్రజా ప్రతినిథులు క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారు. అయినాగానీ, వాళ్ళలో చాలామంది దళిత కోటాలో రాజకీయ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.
ఎప్పుడైతే చట్ట ప్రకారం మతం మారతారో, అప్పుడు రిజర్వేషన్ల వ్యవహారంలో మార్పులు, చేర్పులు వుంటాయ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓ హిందువు, క్రిస్టియానిటీని గౌరవిస్తాడు, ఇస్లాంని కూడా గౌరవిస్తాడు. క్రిస్టియానిటీ, ఇస్లాంలో వ్యవహారాలు వేరేలా వుంటాయి. హిందూ దేవాలయాల్లోని ప్రసాదాల్ని వారు తినరు. విగ్రహారాధనను అస్సలు ఒప్పుకోరు. వారి ఆచారాలు అలా వుంటాయ్.. వారిని తప్పు పట్టడానికి లేదు.
కొన్ని దర్గాల్లో ఎక్కువగా హిందూ భక్తులే కనిపిస్తుంటారు. కొన్ని చర్చిలకు హిందువులు ఎక్కువగా వెళుతుంటారు కూడా. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నిజానికి, ఇలా మతాల గురించిన ప్రస్తావన అంటే.. సున్నితమైన అంశమని అనుకుంటాం, గంభీరమైన అంశం కూడా.
అందుకే, తొందరపడి రాజకీయ నాయకుల మీద, ‘డిక్లరేషన్’ విషయమై అనవసరమైన తేలిక కామెంట్లు చేసెయ్యడం సబబు కాదు. మరీ ముఖ్యంగా వైసీపీకి, ఇది ఏ రకంగానూ మంచిది కాదు. ఏ ఉద్దేశ్యంతో వైసీపీ ఈ డిక్లరేషన్ వ్యవహారంలో రాజకీయ నాయకుల మీద దుష్ప్రచారం షురూ చేసిందోగానీ, హిందూ ఓటు బ్యాంకు శాశ్వతంగా వైసీపీకి దూరమయిపోయేలా వుంది.
సింపుల్‌గా డిక్లరేషన్ మీద గనుక వైఎస్ జగన్ సంతకం చేసేసి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే.. వివాదం అక్కడితో సమసిపోయేదే.! యధా జగన్, తథా వైసీపీ క్యాడర్.. అన్నట్లు, వైసీపీ పతనాన్ని స్వయంగా వైసీపీలోనే అందరూ కోరుకుంటున్నట్టున్నారు.