ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఆన్సర్’ చేయలేదట. చంద్రబాబు మీద అలిగిన పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టేసి, దేవాలయాల సందర్శన కార్యక్రమం పెట్టకున్నారట.! టీడీపీ – జనసేన మధ్య పొత్తు పెటాకులయ్యే అవకాశం.! ఇరు పార్టీల మధ్యా భగ్గుమంటున్న విభేదాలు.. ఇలా సాగింది వైసీపీ దుష్ప్రచారం.!
కట్ చేస్తే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సరదాగా ముచ్చట్లాడుకున్నారు. ఎన్టీయార్ ట్రస్ట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేశారు. కార్యక్రమం టీడీపీ అనుబంధ సంస్థ లాంటిదైన ఎన్టీయార్ ట్రస్ట్‌ది కావడంతో, చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇదే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం అందింది. మిత్రపక్షాలు కదా.. టీడీపీ – జనసేనకి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమిలో మరో మిత్రపక్షమైన బీజేపీ నుంచి కూడా పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తలసీమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమిది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. సరదా సంభాషణలు జరుపుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసి, వైసీపీ క్యాడర్ ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నాయి.
అదేంటీ, టీడీపీ – జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు తమ పార్టీ వైసీపీ ప్రయత్నించింది కదా.? రెండు పార్టీలూ విడిపోయాయని వైసీపీనే దుష్ప్రచారం చేసింది కదా.? ఇదేంటిలా జరిగింది.? అని వైసీపీ శ్రేణులు నిర్ఘాంతపోతున్నాయి. సాక్షి మీడియాని నమ్మితే, ఇలాగే నట్టేట్లో మునగాల్సి వస్తుందని వైసీపీ క్యాడర్.. అందునా, వైసీపీ సోషల్ మీడియా కూలీలు ఇంకోసారి లెంపలేసుకునే పరిస్థితి వచ్చింది.
కనీసం పదేళ్ళ పాటు టీడీపీ – జనసేన – బీజేపీ కలిసే వుంటాయనీ, వుండాలనీ ప్రతిసారీ చెబుతూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట చెబుతున్న సంగతి తెలిసిందే.
వైసీపీ సానుభూతిపరులుగా మారుతున్న కొందరు టీడీపీ అభిమానులు, టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడ్డ కొన్ని మీడియా సంస్థలు.. టీడీపీ – జనసేన కలిసి వుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నమాట వాస్తవం.
అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిన్న చిన్న అభిప్రాయ బేధాల్ని ఇరు పార్టీలూ ఎప్పటికప్పుడు పక్కన పెడుతున్నాయి. అధినేతల స్థాయిలో ఎలాంటి పొరపచ్చాలకూ అవకాశం లేకుండా చంద్రబాబు – పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నారు. పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
అలాంటప్పుడు టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ వచ్చే పరిస్థితి ఎందుకు వుంటుంది.?