YSRCP: వైసీపీ అంటే రెడ్ల పార్టీ.! చాలాకాలంగా వినిపిస్తున్న మాటే ఇది. నెల్లూరు పెద్దారెడ్ల విషయంలో వైసీపీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. అదే, దళిత నాయకుల విషయంలో మాత్రం, తూలనాడుతోంది.! ఎందుకిలా.?
ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఈ పెద్దారెడ్లపైనా వైసీపీ విమర్శలున్నాయి. కాకపోతే, చాలా చాలా చప్పగా.! దీన్నే చూసీ చూడనట్లు వదిలెయ్యడం.. అని అంటుంటారు. మరి, దళిత ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి విషయంలో ఏం జరుగుతోంది.?
అత్యంత బజారుతనంతో కూడిన భాషా ప్రయోగం చేస్తున్నారు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు. వీళ్ళందర్నీ వైసీపీనే పోషిస్తోందన్నది జగమెరిగిన సత్యం. వుండవల్లి శ్రీదేవి మీద మాత్రమే కాదు, ఆమె కుమార్తెల మీద కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, ‘బూతు పదజాలాన్ని’ నిర్లజ్జగా వాడేస్తున్నారు.
ఎందుకిలా.? ఇదే బూతు భాషా ప్రయోగం నెల్లూరు పెద్దారెడ్ల విషయంలో ఎందుకు జరగడంలేదు.? అంటే, జరగాలని కాదు.. వుండవల్లి శ్రీదేవి మీదా జరగకూడదు.. నెల్లూరు పెద్దారెడ్ల విషయంలోనూ జరగకూడదు. కానీ, కేవలం వుండవల్లి శ్రీదేవి మీదనే టార్గెట్ బూతు పంచాంగం ప్రదర్శిస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు.
ఈ మొత్తం వ్యవహారంపై ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితోపాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ సందర్భంగా జర్నలిస్టులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ, ‘రెడ్ల జోలికి వస్తే, రెడ్ల పార్టీకి ఏ గతి పడుతుందో ఆ పార్టీ అధినాయకత్వానికి తెలుసు..’ అంటూ వ్యాఖ్యానించారట.
ఇదే విషయాన్ని వుండవల్లి శ్రీదేవి కూడా ప్రస్తావిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో నాకు రక్షణ లేదు. నాకు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ప్రాణ హాని వుంది..’ అంటూ ఆరోపించారామె. ప్రాణహాణి కూడా దళిత నేత.. అందునా మహిళా నేతకేనా.? కులం చూడం.. మతం చూడం.. అంటూ వేదికలెక్కి ప్రసంగాలు చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దళిత మహిళ, ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి మీద వైసీపీ శ్రేణుల బూతుల పంచాంగంపై ఏం సమాధానం చెబుతారు.?