ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి రాజకీయ విమర్శలూ చేయొద్దని పార్టీ ముఖ్య నేతలకు వైసీపీ అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందట. ఇదే నిజమైతే, వైసీపీలో మార్పు మొదలైనట్లే భావించాల్సి వుంటుంది.
2024 ఎన్నికల్లో వైసీపీకి అత్యంత దారుణ పరాజయం ఎందుకొచ్చిందో తెలుసు కదా.? ఔను, పవన్ కళ్యాణ్ వల్లనే వైసీపీ అంతటి దారుణమైన ఓటమిని చవిచూసింది. కాదు కాదు, పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన విమర్శల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పదే పదే చేయడమే, వైసీపీ ఘోర పరాజయానికి అసలు కారణం.
‘ఔను, మేం ఈ విషయంలో తప్పు చేశాం. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలకు దిగి వుండకూడదు..’ అని ఎన్నికల పోలింగ్ ఫలితాలు వచ్చాక ఓ వైసీపీ అధికార ప్రతినిథి, మీడియా చర్చా కార్యక్రమాల్లోనే స్పష్టతనిచ్చేశారు. కాకపోతే, వైసీపీ అధినాయకత్వానికే అసలు విషయం కాస్త ఆలస్యంగా అర్థమయ్యింది.
కూటమి ప్రభుత్వంపై అంశాల వారీగా విమర్శలు చేయడం వరకూ ఓకే.. అంతేగానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు అస్సలు చేయొద్దన్న స్పష్టమైన ఆదేశాలు స్వయానా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచే, వైసీపీ ముఖ్య నాయకులకు వెళ్ళాయట.
అందుకేనేమో, గత కొన్నాళ్ళుగా వైసీపీ నేతలెవరూ, పవన్ కళ్యాణ్ మీద గతంలోలా నోరు పారేసుకోవడంలేదు.
కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం ఇంకా కొందరు పెయిడ్ నీలి కూలీలు, పవన్ కళ్యాణ్ మీద దూషణలు కొనసాగిస్తూనే వున్నారు. ఈ విషయమై వైసీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ రెడ్డికి కూడా వైఎస్ జగన్ క్లాస్ తీసుకుంటే మేలు.!