ఓడిపోయిన ఫ్రస్టేషన్ లోనో, పార్టీకి పూర్వవైభవం పొందే ఛాన్స్ ఉండబోదన్న క్లారిటీతోనో గానీ వైసీపీ వరద పేరుతో బురద రాజకీయం చేస్తోంది. నిన్నటి వరకు విజయవాడలో సహాయక చర్యలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ ప్రచారం చేసింది. కూటమి పార్టీలు ఏ స్థాయిలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారో ఒక క్లారిటీ వచ్చాక ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీసింది. ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే సహాయక చర్యలు చేస్తున్నారన్న ఫేక్ ప్రచారాన్ని బలవంతంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. శానిటేషన్ వర్కర్స్, అధికారులు ఇంటింటికి వెళ్లి వారి కులం అడిగి సాయం చేస్తున్నారనేది వైసీపీ ఆడుతున్న కొత్త నాటకం. అయితే ఇలాంటి ప్రచారాలు చేసేటప్పుడు చట్టాలకు దొరికిపోతామన్న సోయి లేనట్టుంది. సోషల్ మీడియాలో ఓ వైసీపీ కార్యకర్త ( గతంలో అతడు ఆడవారిపై అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టాడు) ఈ ప్రచారానికి తెరతీశాడు. ఇది మిగిలిన సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం వైరల్ చేసింది.
ఈ పోస్ట్ కాస్తా ఏపీ పోలీసు శాఖ దృష్టికి వెళ్ళింది. ఆ పోస్టును పోలీసు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రకృతి వైపరీత్యాలతో జనాలు ఇబ్బంది పడుతున్న సమయాల్లో సహాయం చేయాల్సింది పోయి.. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని సదరు కార్యకర్తకు, ఎంటైర్ బ్యాచ్ కు వాత పెట్టింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా అడ్డంకులు సృష్టించినా, అసాంఘిక చర్యలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు, ఇతర కార్యకర్తలను రంగంలోకి దించి మరీ విజయవాడలో పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తోంది. సోషల్ మీడియా పోస్టుల్లో కనబడుతున్న సేవా దృక్పథం వైసీపీ కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఎందుకు లేదో వాళ్లకే తెలియాలి.
