తిరుపతిలో నిన్నటి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించట్లేదని పెద్ద రచ్చ జరుగుతోంది. ఎందుకంటే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు మంగళవారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ సిపాయిని ఎవరో కిడ్నాప్ చేశారని.. కావాలనే కూటమి నేతలు ఇదంతా చేయిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇదే విషయం మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో నిజంగానే ఆయన కిడ్నాప్ కు గురయ్యారేమో అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు దీనికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చెక్ పెట్టారు.
తన ఇంట్లో నుంచి వీడియో రిలీజ్ చేశారు. తాను బాగానే ఉన్నానని.. ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. తనకు అనారోగ్యం కారణంగా బయటకు రావట్లేదని.. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ఇంటివద్దనే ఉంటున్నట్టు తెలిపారు. కాబట్టి బయట జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని.. మీడియా, పోలీసులు ఈ విషయాన్ని గ్రహించాలంటూ ఆయన కోరారు. తన కిడ్నాప్ చుట్టూ రూమర్లు సృష్టించొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఆయన వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ వాళ్లే కావాలని ఈ ఫేక్ ప్రచారం చేశారంటూ స్థానిక కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.