అదేంటీ, శాసన మండలిని రద్దు చేస్తూ అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసింది కదా.? ఆ తీర్మానాన్ని రాష్ట్రంలోని ఉభయ సభల్లోనూ ఆమోదింపజేసి, కేంద్రానికి కూడా పంపడం జరిగింది కదా.?
శాసన మండలి.. అంటేనే, ఖర్చు దండగ వ్యవహారమంటూ తీవ్రస్థాయిలో అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిథులు, ముఖ్యమంత్రి సహా.. చట్ట సభల్లో నీతులు చెప్పారు కదా.? మరిప్పుడు ఏమైంది.?
ఇప్పుడేంటి.? అప్పట్లో శాసన మండలి రద్దు.. అన్నారుగానీ, వైసీపీకి చెందిన కొందరు రాజకీయ నిరుద్యోగుల్ని అదే శాసన మండలికి పంపి, ‘ఖర్చు దండగ’ చేసింది వైసీపీ. ప్రజాధనమే కదా.. ఖర్చు దండగైతేనేం.. అనుకుని వుంటారు.
సరే, అసలు విషయానికొద్దాం.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని శాసన మండలికి పంపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. అదీ, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో.!
అవసరమైన సంఖ్యాబలం వుండడంతో బొత్స ఎమ్మెల్సీ అవడం దాదాపు ఖాయమేనని వైసీపీలో చర్చ జరుగుతోంది. కానీ, ప్రభుత్వం మారింది కదా.! లెక్కలు ఆటోమేటిక్‌గా మారిపోతాయ్.! టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి కాస్త ఫోకస్ పెడితే, వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుండు సున్నా కొట్టేయొచ్చు.
అయినా, బొత్స సత్యనారాయణని ఎందుకు ఎమ్మెల్సీని చేయాలని వైఎస్ జగన్ అనుకుంటున్నారబ్బా.? ‘విశాఖలో సమర్థుడైన నాయకుడే వైసీపీకి లేడా.? పొరుగునున్న విజయనగరం నుంచి తీసుకురావాలా.?’ అంటూ వైసీపీకి చెందిన విశాఖ నేతలు కొందరు గుస్సా అవుతున్నారు. ట్విస్ట్ అంటే ఇదీ.!
నిజానికి, బొత్స రాజ్యసభకు వెళ్ళాలనుకున్నారట. కానీ, జగన్ అతి బలవంతం మీద, ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఓడిపోయారు. అద్గదీ అసలు సంగతి. బొత్సని శాంతపర్చేందుకే జగన్, ఈ ఎమ్మెల్సీ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ఓడిన బొత్స, ఎమ్మెల్సీగా మాత్రం ఎలా గెలుస్తారు.? అని ఇటు విశాఖతోపాటు అటు విజయనగరంలోనూ జనం చర్చించుకుంటున్నారు.
మరోపక్క, బొత్స సత్యనారాయణ పార్టీ మారే ఆలోచనతో వున్నారనీ, ఈ క్రమంలో విధిలేని పరిస్థితుల్లోనే ఆయన్ని ఎలాగైనా శాసన మండలికి పంపాలనే ఆలోచన జగన్ చేశారన్న వాదనా లేకపోలేదు.
జగన్ అమాయకత్వం కాకపోతే, ఎమ్మెల్సీగా ఒకవేళ బొత్స సత్యనారాయణ గెలిచినా, వైసీపీలోనే వుంటారన్న గ్యారంటీ ఏంటి.? ఈ ఫీడ్‌బ్యాక్ ఆల్రెడీ జగన్ దగ్గరకు వెళ్ళిందట.