కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.?
ఈ ప్రశ్న సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి నుంచి, అసెంబ్లీలోనే వచ్చింది. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. కానీ, చిత్రంగా ఆ ఎమ్మెల్యేలు హాజరు పట్టీలో సంతకాలు చేస్తున్నారట. అదీ దొంగతనంగా అసెంబ్లీకి వస్తున్నారట. ఇదీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఉవాచ.
అయితే, వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, శాసన సభ్యులుగా తాము అసెంబ్లీకి వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెడుతున్నది, సభ ముందు కొన్ని ప్రశ్నలు ప్రజల తరఫున వుంచడానికి.. అంటూ సెలవిచ్చారు.
శాసన సభ్యుల్ని అవమానించేలా స్పీకర్ తీరు వుందన్నది వైసీపీ వాదన. అక్కడిదాకా వెళ్ళి, సంతకాలు పెట్టే వైసీపీ ఎమ్మెల్యేలు, గౌరవ ప్రదంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వొచ్చు కదా.! ఆ ప్రశ్నలేదో, తమకు కేటాయించిన సమయంలో ప్రభుత్వానికి వేయొచ్చు కదా.?
అసలు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళుతున్నారన్న విషయమే ఎవరికీ తెలియదు. ఇటీవల శాసన సభ్యుల గ్రూప్ ఫొటోలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సహా, వైసీపీ ఎమ్మెల్యేలెవరూ కనిపించలేదు. శాసన మండలి సభ్యుల గ్రూప్ ఫొటోలో మాత్రం, బొత్స సత్యనారాయణ సహా వైసీపీ శాసన మండలి సభ్యులంతా కనిపించారు.
ఒక్కటి మాత్రం నిజం.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతోంది. ఇంకోపక్క, శాసన సభ్యులకు గౌరవ వేతనాల్ని కూడా లక్షల్లో చెల్లిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.
అసలంటూ శాసన మండలి సమావేశాల వైపు చూసేందుకే ఇష్టపడని ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని గౌరవ వేతనం రూపంలో దోచిపెట్టాల్సిన అవసరం ఏముందన్నది సామాన్యుడి నుంచి వస్తున్న ప్రశ్న.
కేవలం, గౌరవ వేతనం మాత్రమే కాదు, ఇతరత్రా ప్రోటోకాల్స్ సహా అనేక వెసులుబాట్లు శాసన సభ్యులకు వుంటాయి. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మంచిది కదా.!
ఎవరైతే అసెంబ్లీకి వెళ్ళి, తమ తమ నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు అసెంబ్లీలో పని చేస్తారో.. అలాంటి వారిని అసెంబ్లీకి పంపించే అవకాశం ఆయా నియోజకవర్గాల ప్రజలకు కలగాలంటే, వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాల్సిందే.
లేదూ, ఇదే పద్ధతి ఇలాగే కొనసాగనివ్వడమంటే, దొంగచాటుగా హాజరు పట్టీలో సంతకాల వ్యవహారం సర్వసాధారణమైపోతుంది. తద్వారా విలువైన ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, బాధ్యతగల పదవిలో వుండి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సి వుంది.
అదే సమయంలో, ‘దొంగచాటుగా ఏమీ మేం వెళ్ళడంలేదు’ అంటూ బుకాయిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వుంటుంది. ప్రజాధనాన్ని అప్పనంగా బొక్కితే అది మంచిది కాదు.. అన్న విషయాన్ని గుర్తెరిగి, గౌరవంగా తమ పదవులకు రాజీనామా చేస్తే మంచిదేమో.