ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కనీసం 20 స్థానాల్లో ఆధిపత్యం చూపించిన ఆ పార్టీ 10 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా క్యాబినెట్ మిత్రులందరూ ఘోర ఓటమి పాలయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా వీరు మాత్రం నోటి దురుసుతోనే ఓటమిని కొని తెచ్చుకున్నారు. వాళ్లు ఎవరో చూద్దాం..
ఆర్కే రోజా
వైయస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2022 లో మంత్రి పదవి దక్కించుకున్నారు. పార్టీ పదవిలోకి వచ్చినప్పటి నుంచే జోరు ప్రదర్శించిన రోజా మంత్రి అయ్యాక మరింత దూకుడుగా వ్యవహరించారు. మంత్రి స్థాయిలో ఉన్న ఆమె తన హోదాని మరిచిపోయి మరి ప్రెస్ మీట్ లలో ప్రతిపక్షంపై విరుచుకుపడేవారు. మరి ముఖ్యంగా సందర్భంతో పని లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేసేవారు. ఏనాడు కనీసం ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి ప్రస్తావించేవారు. అలా విసిగిపోయిన ఓటర్లు ఆమెని ఇంటికి పంపారు. ఆమెని తన సమీప ప్రత్యర్థి, కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ నాయుడు 44 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు.
అంబటి రాంబాబు
ఏపీ మంత్రులలో దూకుడుగా వ్యవహరిస్తున్న మరో మంత్రి అంబటి రాంబాబు. జలవనరుల శాఖామంత్రి అయినప్పటికీ పోలవరం గురించి ప్రశ్నించినప్పుడల్లా పొంతన లేని సమాధానాలు చెప్పేవారు. ఆ ప్రాజెక్టు గురించి అసలు ఆయనకు అవగాహన లేదని చాలా సందర్భాల్లో తేలిపోయింది. ప్రతిపక్షంపై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ రెచ్చిపోయేవారు. సమయం సందర్భంతో పని లేకుండా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవారు. సోషల్ మీడియాలో ఆయన పోస్టులు కూడా అసభ్య పదజాలంతోనే దర్శనం ఇచ్చేవి. వీటన్నింటికీ ఈ ఎన్నికల్లో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏ దశలోనూ ప్రత్యర్థి కన్నా లక్ష్మి నారాయణ కు ఆయన గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. ఫలితంగా ప్రత్యర్థి చేతిలో 26 వేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
అనిల్ కుమార్ యాదవ్
వైసిపి ప్రభుత్వం క్యాబినెట్ లో సందర్భంతో పని లేకుండా రెచ్చిపోయి మాట్లాడే మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయినప్పటికీ తన దూకుడు మాత్రం తగ్గించలేదు. నడి వీధుల్లో అసభ్యపదజాలంతో మాట్లాడుతూ హల్ చల్ చేసేవారు. ఇక అసెంబ్లీ సమావేశాలప్పుడైతే ఆయన ప్రవర్తనకి హద్దే ఉండేది కాదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతిపక్ష నేతలని దూషించేవారు. ఈసారి ఆయన నరసరావుపేట ఎంపీ గా పోటీలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి లావు కృష్ణదేవరాయలు చేతిలో ఘోర ఓటమి చవి చూశారు.
కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు కొడాలి నాని. మొదటినుంచి తన ఆహార్యం, భాష మంత్రి స్థాయికి తగినట్లు ఉండేవి కాదు. ప్రెస్ మీట్ లలో అయితే బూతులతో ప్రతిపక్షం పై విరుచుకు పడేవారు. అసెంబ్లీలో అయితే ఆయన నోటికి అదుపే ఉండేది కాదు. ఆయన వ్యవహార శైలి రుచించని ఓటర్లు ఘాటు సమాధానమే చెప్పారు. ఫలితంగా ఆయన పోటీ చేసిన గుడివాడ లో సమీప కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 46 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.