పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో వైసీపీ మొదటి నుంచీ ఓ చిత్రమైన గేమ్ ప్లాన్ అమలు చేస్తూ వస్తోంది. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారీ వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వర్మ.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి పొత్తులో భాగంగా, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న వర్మ, ఆ సీటుని త్యాగం చేయక తప్పలేదు.
జనసేన నుంచీ, టీడీపీ నుంచీ.. ఆ మాటకొస్తే, బీజేపీ నుంచి కూడా ఈ తరహా త్యాగాలు నడిచాయ్. అంతిమంగా, కూటమి బంపర్ విక్టరీ కొట్టిందనుకోండి.. అది వేరే చర్చ. అయితే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని దెబ్బ కొట్టడానికి, వర్మ ఫ్యాక్టర్‌ని వైసీపీ వాడుకునేందుకు విచ్చలవిడిగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.
టీడీపీ కార్యకర్తల ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలు, వర్మకి మద్దతుగా పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పిఠాపురంలో నినాదాలు చేయడం చూశాం. అప్పట్లో అదో సంచలనం. కానీ, వర్మ ఆ వివాదానికి వెంటనే ముగింపు పలికేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ తనవంతు కృషి చేసిన మాట వాస్తవం.
వర్మకి రాజకీయ భవిష్యత్తు బావుంటుందనీ, ఈ క్రమంలో తాను చేయగలిగిందంతా చేస్తానని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పారు కూడా. అయితే, తాజా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వర్మకి అవకాశం దక్కలేదు. అదే సమయంలో, నాగబాబుకి అవకాశమిచ్చారు. కూటమి తరఫున నాగబాబుకీ, సోము వీర్రాజుకీ.. అవకాశమిచ్చారు చంద్రబాబు.
జనసేనకు ఒక సీటు కేటాయించగా, అది నాగబాబుకి వెళ్ళింది. బీజేపీకి ఒకటి కేటాయించగా, అది సోము వీర్రాజుకి వెళ్ళింది. టీడీపీ నుంచి ముగ్గురికి అవకాశమిచ్చారు చంద్రబాబు. ఆ ముగ్గురిలో వర్మ పేరు లేదు. ఇది పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారం.
కానీ, వైసీపీ మాత్రం వర్మకి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్.. అంటూ దుష్ప్రచారానికి తెరలేపింది. టీడీపీలో వైసీపీకి సహకరించే ఓ వర్గం కూడా పవన్ కళ్యాణ్ మీద నిందారోపణలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఓ వర్గం మీడియా, జనసేనకు సంబంధం లేని విషయాన్ని జనసేనకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది.
జనసేన తరఫున ఆ పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ దుష్ప్రచారాన్ని ఖండించారు. మరోపక్క, వర్మ కూడా తమ పార్టీ అధినాయకత్వం ఎలా నిర్ణయిస్తే, అలా తాను నడుచుకుంటానంటూ స్పష్టతనిచ్చారు. పదవుల విషయమై చంద్రబాబుదే తుది నిర్ణయమనీ చెప్పారు వర్మ.
వర్మ ప్రకటనతో ఒక్కసారిగా వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వర్మ మీద సింపతీ చూపిస్తే, టీడీపీని కాదని వర్మ వైసీపీలోకి వచ్చేస్తారని వైసీపీ నేతలు చాలా చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపించింది వ్యవహారం. గతంలో కూడా వైసీపీ ఇదే తరహా గేమ్ ప్లాన్ అమలు చేసి, చేతులు కాల్చుకుంది.
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ – జనసేన కార్యకర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అస్సలు లేదు. పవన్ కళ్యాణ్ – వర్మ మధ్య కూడా సన్నిహిత సంబంధాలే వున్నాయ్. ఇవన్నీ తెలిసీ పదే పదే వైసీపీ చేతులు కాల్చుకోవడాన్ని ఎలా చూడాలి.?