‘మేం అధికారంలోకి వస్తే, సంపూర్ణ మద్య నిషేధం చేసేస్తాం. సంపూర్ణ మద్య నిషేధం చేశాకే, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. చెయ్యలేకపోతే, ఓట్లు అడగం..’ అని సాక్షాత్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2019 ఎన్నికల సమయంలో నినదించారు.
దశల వారీ మద్య నిషేధం చేసి, చివరికి సంపూర్ణ నిషేధం చేస్తాం.. అంటూ, అప్పుడే మళ్లీ సవరణ చేసుకున్నారు తన మాటలకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సంపూర్ణ మద్య నిషేధం చేశాకనే, 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతామనీ సెలవిచ్చారు అప్పట్లోనే.
కానీ, అధికారంలోకి వచ్చాక, మద్యం రేట్లు పెంచేశారు. రేట్లు పెంచితే, మద్యం వినియోగం తగ్గుతుందంటూ కట్టు కథ అల్లారు. ఆ తర్వాత మళ్ళీ మద్యం రేట్లను కాస్త తగ్గించారు. ఇలా మద్యంతో వైసీపీ ఆడిన ఆటలు అన్నీ ఇన్నీ కావు.
నాణ్యమైన మద్యం.. అనే మాట అనకూడదుగానీ, అస్సలేమాత్రం నాణ్యత లేని మద్యాన్ని పిచ్చి పిచ్చి బ్రాండ్ల పేరుతో జనంలోకి పంపి, మందుబాబుల ప్రాణాల్ని తీసేసింది వైసీపీ సర్కార్.
ఐదేళ్ళలో దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని వైసీపీ హయాంలో విక్రయించారంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇది కాక, కల్తీ మద్యం, నాటు సారా.. ఇవన్నీ అదనం. వాటి వల్ల ప్రాణాలు కోకొల్లలుగా పోయాయ్.
సుమారు 18 వేల కోట్ల రూపాయల్ని ఈ మద్యం ద్వారా వైసీపీ సంపాదించిందన్న విమర్శ వుంది. అందులో రెండు వేల కోట్ల రూపాయల్ని విదేశాలకు హవాలా ద్వారా తరలించారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
ఈ లిక్కర్ మాఫియాపై కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి, లిక్కర్ మాఫియాలో అడ్డంగా బొక్కేసిన సొమ్ముతో, ఓ సినిమా కూడా నిర్మించినట్లు విచారణలో తేలింది. రాజ్ కసిరెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు కావడం విశేషం.
రాష్ట్రంలో ప్రధాన డిస్టిలరీలన్నీ, రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లోనే నడిచాయి. ఈ డిస్టిలరీల ద్వారా వైసీపీ నేతలు కొందరు కోట్లు వెనకేసుకున్నారు. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ మాఫియాతో పోల్చితే, ఏపీలో వైసీపీ లిక్కర్ మాఫియా పది రెట్లు ఎక్కువ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడిగేది లేదని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డే, లిక్కర్ ద్వారా ఆదాయం రాకపోతే, సంక్షేమ పథకాలు అమలు చేయలేం.. అని అసెంబ్లీలో బుకాయించిన పరిస్థితినీ చూశాం.
ప్రజా సంక్షేమం సంగతేమోగానీ, లిక్కర్ మాఫియా వైసీపీ సంక్షేమానికి బాగా ఉపయోగపడింది.