ఏం.. రాజకీయ నాయకులకు మాత్రం సినిమా పిచ్చి వుండకూడదా.? ఎందుకు వుండకూడదు.. వుండొచ్చు.! కాకపోతే, రాజకీయ అవసరాల కోసమే సినిమా పిచ్చి ప్రదర్శిస్తే.. అదే ఒకింత అసహ్యంగా వుంటుంది.
అసలు విషయానికొస్తే, వైసీపీ హయాంలో మంత్రులు, సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారు. పవన్ కళ్యాణ్ నుంచి ఏదన్నా సినిమా వస్తే చాలు, తొలి రోజే.. డిజాస్టర్ రివ్యూలు ఇచ్చేవారు వైసీపీ నాయకులు, అందునా మంత్రులైతే మరీనూ.!
సినిమా విడుదలకు ముందు కూడా దిక్కుమాలిన రివ్యూలతో మంత్రులు పరువు పోగొట్టుకునేవారు. సినిమాలో సత్తా వుంటే, ఏ రివ్యూ కూడా సినిమాని ఆపలేదు. వైసీపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ సినిమాలకు అడ్డం పడే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే.
మరో సినీ నటుడు నాని నటించిన సినిమాలకి కూడా వైసీపీ అడ్డం పడుతూ వచ్చేది. అంతెందుకు, ‘పుష్ప ది రైజ్’ సినిమా విషయంలోనూ వైసీపీ చేసిన చెత్త రివ్యూల హడావిడి అంతా ఇంతా కాదు. కానీ, ‘పుష్ప 2 ది రూల్’ విషయానికొచ్చేసరికి సీన్ మారిపోయింది.
ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్ళాడు సినీ నటుడు అల్లు అర్జున్. ఆ తర్వాతి నుంచీ అల్లు అర్జున్‌ని తమ నాయకుడిగా వైసీపీ మార్చేసుకుంది. అందుకే, ‘పుష్ప 2 ది రూల్’ సినిమాకి ప్రమోషన్ల బాధ్యతని వైసీపీ పూర్తిగా తన భుజానికెత్తుకుంది.
వైసీపీ హయాంలో మంత్రులుగా పని చేసిన పలువురు నాయకులు, సోషల్ మీడియా వేదికగా పుష్ప అదిరింది.. అంటూ రివ్యూలు ఇచ్చేశారు. కొందరైతే ‘పుష్ప 2 ది రూల్’ బాగుందని చెప్పడం కంటే, అల్లు అర్జున్‌ని ఎలివేట్ చేస్తూ, మెగా కాంపౌండ్ మీద బురద చల్లేందుకు విశ్వప్రయత్నాలూ చేశారు.
సినిమాలోని డైలాగుల్ని తమకు తోచినట్లు మార్చేసి, అల్లు అర్జున్‌కీ, మెగా కాంపౌండ్‌కీ దూరం పెంచే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం, ‘పుష్ప 2 ది రూల్’ సినిమా పేరు చెప్పి, నానా రచ్చా చేసింది.
ఇన్ని తంటాలు పడినా, ‘పుష్ప 2 ది రూల్’ టీమ్ మాత్రం, సినిమా విడుదలయ్యాక, మెగాస్టార్ చిరంజీవిని కలిసి, ఆయన ఆశీస్సుల్ని తీసుకుంది. దర్శకుడు సుకుమార్ సహా మైత్రీ నిర్మాతలు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంట్లో కలిసి ‘బ్లెస్సింగ్స్’ తీసుకున్నారు.
దాంతో, అప్పటిదాకా చిరంజీవి మీద విమర్శలు చేస్తూ అల్లు అర్జున్‌ని లేపిన వైసీపీ క్యాడర్ ఒక్కసారిగా నీరుగారిపోయారు.
అయినా, వైసీపీ నాయకులకు ఇదేం సినిమా పిచ్చి.? వైసీపీకి కూడా కొందరు నిర్మాతలు నటీనటులు సానుకూలంగా వుంటారు కదా. వారితో సినిమాలు తీయించుకుంటారు కదా.? ఇతర సినిమాల మీద, ఇతర హీరోల మీద రాజకీయంగా పడి ఏడవడం ఏంటి.?