మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు మరియు వీరమహిళలను గౌరవిస్తూ ఐక్యతతో పని చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూటమి సమన్వయ కమిటీ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని, జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌దే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.
బుధవారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని సిగడం మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్చార్జ్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కె. నాగబాబు వారికి పార్టీ కండువాలు కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
జనసేనలో చేరిన వారిలో వైసీపీలో పీఏసీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రస్తుత సర్పంచ్ తిరుమరెడ్డి గౌరీశంకర్, మక్కా సాయిబాబు నాయుడు, బత్తుల స్వాతి, టెంకల రామకృష్ణ, ఎర్రబోలు సింహాచలం, రౌతు నారాయణరావు, కోమర్ల సామయ్య, గొరుసుపూడి నారాయణరావు, ఇనపకుర్తి అప్పలదాసు, కోనల సత్యనారాయణ, ఎర్రబోలు అన్నారావు, అంకం జగన్నాథం, బత్తుల వెంకట కృష్ణారావు, యాసర్ల శివ, కాకర్ల నీలకంఠం, దుర్గాసాయి రామారావు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా కె. నాగబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన పలువురు నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని అన్నారు. చాలా మంది జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అయితే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోవడం లేదని, మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకులను మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య వంటి నాయకులు కూడా అదే కారణంతో పార్టీలో చేరారని పేర్కొన్నారు.
జనసేన పార్టీ ఎన్నో అపజయాలను చూసిందని, ఒక విజయం వచ్చినందుకు అతిగా ఉప్పొంగే పార్టీ కాదని నాగబాబు అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పారు. అన్ని మతాలు, అన్ని కులాలను సమానంగా గౌరవించడం జనసేన సిద్ధాంతమని పేర్కొన్నారు. తాను 14 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఉందని, కార్యకర్తల మనోభావాలు బాగా తెలుసని తెలిపారు. కార్యకర్తల గౌరవం దెబ్బతినకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శులు తాలాబత్తుల పైడిరాజు, వడ్డాది శ్రీనివాసరావు, సిగడం మండలం ఉపాధ్యక్షుడు పొగిరి అప్పలనాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా జనసేనలో చేరిన సర్పంచులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సర్పంచుల గౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. ప్రజల కోసం పని చేయాలని ఎన్నికైన సర్పంచులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన విలువ కూడా సర్పంచులకు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా తీసుకుంటున్న చర్యలు చూసి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజాసేవ కోసం జనసేనతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.



