‘మేం శాసన మండలిలో ప్రభుత్వంతో పోరాడుతోంటే, కనీసం శాసన సభ్యుడిగా మీరు శాసన సభకి హాజరై, వైసీపీ వాయిస్‌ని బలంగా వినిపించకపోతే ఎలా.?’ వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సూటిగా సంధిస్తున్న ప్రశ్న ఇది.
ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్సీ, ఈ విషయమై ఒకింత ఘాటుగానే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాజగా నిలదీశారట.. అదీ, చాలా చాలా గట్టిగా ఆ నిలదీత జరిగిందట. ‘నిజమే కదా.. అలా ప్రశ్నించడంలో తప్పేముంది.? శాసన సభకి వెళితేనే కదా, అక్కడ మన వాయిస్ ఎంత గట్టిగా వినిపించగలమో, మనకి తెలిసేది. అధికార పక్షం నుంచి అవమానాలు ఎదురైతే, ప్రజా క్షేత్రంలో అవి మనకు అడ్వాంటేజ్ అవుతాయి కదా..’ అని సదరు వైసీపీ ఎమ్మెల్సీకి, వైసీపీలోని ఇతర కీలక నేతల నుంచి మద్దతు లభిస్తోందిట కూడా.
‘రాష్ట్రానికి బడ్జెట్ సమావేశాలు చాలా చాలా కీలకం. అలాగే, ఆయా నియోజకవర్గాలకు కూడా, ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి మనకీ ముఖ్యమే. ఆయా సమస్యలపై మనం అసెంబ్లీలో మాట్లాడకపోతే, నియోజకవర్గాల్లో తిరగలేం. ప్రజల నుంచి చీవాట్లు తప్పవు..’ అని ఓ వైసీపీ ఎమ్మెల్యే సైతం, అధినేతపై గుస్సా అవుతున్నారట.
‘గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు కదా..’ అని కొందరు వైసీపీ నేతలు అంటోంటే, ‘అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు.’ అని ఆ వైసీపీ నేతలకు, వైసీపీ ఎమ్మెల్సీలు ఘాటుగానే సమాధానమిస్తున్నారట.
‘అంతర్యుద్ధం లేవదీయాలనుకుంటున్నారా.?’ అంటూ వైసీపీ కీలక నేత ఒకరు, ‘తిరుగుబాటుకి సిద్ధమవుతున్న ప్రజా ప్రతినిథులపై’ తాజాగా ఒకింత గుస్సా అయినట్లు తెలుస్తోంది.
‘ఇలాగైతే పార్టీలో కొనసాగలేం. జగన్, అసెంబ్లీకి రావాల్సిందే..’ అని దాదాపు అరడజను మంది వైసీపీ ప్రజా ప్రతినిథులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) ముక్త కంఠంతో తేల్చి చెప్పారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.
‘మా దారి మేం చూసుకోవడానికి సైతం వెనుకాడం’ అని ఖరాఖండీగా సదరు ప్రజా ప్రతినిథులు అధినాయకత్వానికి చెప్పేశారంటే, వాళ్ళంతా వైసీపీకి గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమేనని అనుకోవాలేమో.!