తిరుపతి జిల్లాలోని నగరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. కానీ గత కొంతకాలంగా నగరి నియోజకవర్గంలో అప్పుడప్పుడు పర్యటిస్తున్నారు. ఇటీవల తాడేపల్లి లో మాజీ సీఎం జగన్ ని కలిశారు. వైసీపీ లో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ ప్రస్తుతానికి పార్టీలో చేరికకు బ్రేక్ పడింది.
నగరి మాజీ ఎమ్మెల్యే అయిన రోజా కు జగదీష్ ద్వారా చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో పెద్ద తలకాయలా ఉన్న పెద్దిరెడ్డికి రోజాకు కొన్నాళ్లుగా పొసగడం లేదు. తనకు తెలియకుండా పెద్దిరెడ్డి తన నియోజకవర్గం లో రాజకీయాలు చేస్తున్నాడని అప్పట్లో పలుమార్లు రోజా ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది రోజులపాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న రోజా.. ఇటీవల యాక్టివ్ గా అయ్యారు. పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో గాలి జగదీష్ వైసీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో అతడిని అడ్డుకునేందుకు రోజా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవేమీ పట్టని వైసీపీ జగదీష్ కు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తోంది. తమ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తామని జగదీష్ కు ఇప్పటికే అధిష్టానం మాట ఇచ్చిందట. అంతేకాకుండా నగరి నియోజకవర్గంలో భాను ప్రకాష్ నాయుడుకు ఎంత పట్టు ఉందో జగదీష్ కి కూడా అంతే ఆదరణ ఉంది. ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి కావడంతో జగదీష్ పై గురిపెట్టి రోజాని సైడ్ చేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.