కోట్లు ఖర్చు చేసినా.. ఇంత పబ్లిసిటీ రాదేమో.! ‘హరి హర వీర మల్లు’ సినిమా విషయంలో వైసీపీ చేస్తున్న యాగీ, ఆ సినిమాకి మరింతగా కలిసొస్తోంది పబ్లిసిటీ పరంగా.!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరి హర వీర మల్లు’ నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతకన్నా ఓ రోజు ముందు, ప్రీమియర్స్ పడ్డాయి.. అదీ కనీ వినీ ఎరుగని స్థాయిలో. అసలంటూ థియేటర్లు దొరుకుతాయా.? అన్నంత గందరగోళం నడుమ, ప్రీమియర్ షోస్ రికార్డు స్థాయిలో పడ్డాయి. సినిమా చూడ్డానికి సగటు సినీ అభిమాని, పోటీ పడటమే అందుక్కారణం.
23వ తేదీ మధ్యాహ్నం నుంచి.. సినిమాపై హైప్ క్రమక్రమంగా పెరిగిపోయింది. ట్యాక్స్‌లు కలుపుకుని, 700 రూపాయల పైనే పలికింది కొన్ని థియేటర్లలో ప్రీమియర్స్ టిక్కెట్. అయినా, ప్రేక్షకాభిమానులు సినిమా చూడ్డానికి అస్సలేమాత్రం వెనకడుగు వేయలేదు. ఫలితంగా, ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి.
30 కోట్ల పైనే ప్రీమియర్స్ ద్వారా గ్రాస్ వచ్చినట్లు స్వయంగా ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ అధినేతలు ప్రకటించేశారు కూడా. అన్ని ఏరియాల నుంచీ, ఎగ్జిబిటర్లు సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారంటూ థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ఎఎం రత్నం ప్రకటించడం గమనార్హం.
సినిమా రిజల్ట్ ఇలా వుంటే, సోషల్ మీడియాలో వైసీపీ పైత్యం వేరేలా వుంది. సినిమా మీద విపరీతమైన నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ. తమ పార్టీ వ్యవహారాల్ని గాలికొదిలేసి మరీ వైసీపీ నేతలు, కార్యకర్తలు ‘హరి హర వీర మల్లు’ సినిమా మీద పడ్డారు.
చిత్రమేంటంటే, చాలామంది వైసీపీ కార్యకర్తలు, ప్రీమియర్స్ చూసినా.. అందులోంచి, ‘నచ్చని కంటెంట్’ ఏదీ సోషల్ మీడియాలో ప్రస్తావించలేకపోయారు. దాంతో, సహజంగానే, వైసీపీ చేసిన నెగెటివ్ ట్రోలింగ్, ‘హరి హర వీర మల్లు’ సినిమాకి పాజిటివ్ పబ్లిసిటీగా మారుతోంది.
గతంలో అయితే, మంత్రులుగా పని చేసిన వైసీపీ నేతలు, తమ శాఖల వ్యవహారాలు వదిలేసి, పవన్ కళ్యాణ్ సినిమాలకు నెగెటివ్ రివ్యూలు చెప్పుకున్న సంగతి గుర్తుండే వుంటుంది.
