శాసన మండలిని ఖర్చు దండగ వ్యవహారంగా అభివర్ణించారు గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో శాసన మండలిని రద్దు చేస్తూ, అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించారు. కేంద్రానికి కూడా ఆ తీర్మానాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం పంపింది.
దానిక్కారణం కూడా లేకపోలేదు. అప్పటికి శాసన మండలిలో టీడీపీకి మెజార్టీ వుంది. దాన్ని జీర్ణించుకోలేక, తాము తెరపైకి తేవాలనుకుంటున్న దిక్కుమాలిన చట్టాలకు, శాసన మండలిలో ఇబ్బందులు వస్తాయన్న భయంతో ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.
ఆ శాసన మండలి లేకపోయి వుంటే, మూడు రాజధానుల పేరుతో, రాష్ట్రాన్ని వైసీపీ మూడు ముక్కలు చేసేదే.! ఆ తర్వాత వైసీపీకి శాసన మండలిలో మెజార్టీ వచ్చిందనుకోండి.. అది వేరే చర్చ.
ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ సభ్యులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. శాసన సభకు ఎలాగూ వైఎస్ జగన్ హాజరు కావడంలేదు. ఈ క్రమంలో శాసన మండలిలో వైసీపీ సభ్యులు మాట్లాడుతున్న మాటల్ని మాత్రమే వైసీపీ ప్రచారం చేసుకోగలుగుతోంది.
చట్ట సభల్లో వైసీపీ ఉనికి అంటే, అది శాసన మండలి ద్వారానే వైసీపీకి సాధ్యమవుతోంది. కానీ, ఇది ఎన్నో రోజులు ఇలాగే కొనసాగే పరిస్థితి లేదు. ఎందుకంటే, శాసన మండలి సభ్యులు ఒకరొకరుగా వైసీపీకి దూరమవుతున్నారు. కొందరి పదవీ కాలం కూడా ముగియబోతోంది. కొత్త సభ్యులూ సభలోకి అడుగు పెడుతున్నారు. పాత సభ్యులు ఔట్ అయిపోతున్నారు.
టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికి శాసన మండలిలో బలం పెరిగితే, ఆ శాసన మండలిని కూడా వైసీపీ బాయ్ కాట్ చేసే అవకాశం లేకపోలేదు.
వైఎస్ జగన్, గతంలో ‘దేవుడి స్క్రిప్ట్’ అనే మాట ఉపయోగించేవారు. ఆ దేవుడి స్క్రిప్టు వల్లనేనేమో, ఏ శాసన మండలిని అయితే జగన్ వద్దనుకున్నారో, ఆ శాసన మండలి మాత్రమే వైసీపీ పరువుని కాస్తయినా కాపాడుతోందిప్పుడు. ఇక్కడా మెజార్టీ కోల్పోతే.. దేవుడి స్క్రిప్టులో అది తదుపరి భాగం అవుతుంది.
