జనసేన పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఎవరో, ముద్రగడ పద్మనాభంపై హత్యాయత్నానికి ప్రయత్నించాడట.! ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర భీతావహ వాతావరణం చోటు చేసుకుందట. ముద్రగడకి చెందిన వాహనం ధ్వంసమైందట, దాడికి పాల్పడిన వ్యక్తిని చావగొట్టారట ముద్రగడ అనుచరులు.
ఇందులో రక్తమోడుతున్న సదరు వ్యక్తికి సంబంధించిన వీడియోల్ని వైసీపీనే ప్రచారంలోకి తీసుకొచ్చింది. ముద్రగడపై హత్యాయత్నం.. కాపు సమాజం ఈ దాడిని ఖండించాలి.. అంటూ వైసీపీ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. జరుగుతున్న పరిణామాలపై స్థానిక జనసేన నాయకులు స్పందించారు.
దాడికి పాల్పడిన వ్యక్తికి జనసేన పార్టీతో సంబంధం లేదంటున్న జనసేన నేతలు, ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు కూడా. మామూలుగా అయితే, ఇక్కడితో మేటర్ క్లోజ్.! కానీ, అలా ఎలా ఊరుకుంటుంది వైసీపీ.? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనుసన్నల్లో ఈ దాడి జరిగిందనీ, ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర దీని వెనకాల వుందనీ.. వైసీపీ ఆరోపిస్తోంది.
ఇంతకీ, ముద్రగడ పద్మనాభంపై హత్యాయత్నమంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? అక్కడి జనం ఏమనుకుంటున్నారు.? ఈ విషయాల్లోకి వెళితే, పలు ఆసక్తికరమైన విషయాలు, వాటితోపాటే చాలా అనుమానాలూ తెరపైకొస్తున్నాయి.
నిజానికి, రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు ముద్రగడ పద్మనాభం. పైగా, ఆయనిప్పుడు కాపు నాయకుడు కూడా కాదు. ఆయనే తన పేరుని మార్చుకున్నారు, గెజిట్ ద్వారా ‘రెడ్డి’ అని పెట్టుకున్నారు. సరే, పేరు మార్చుకుంటే కులం మారుతుందా.? అన్నది వేరే చర్చ.
చాలాకాలంగా ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. 2024 ఎన్నికల సమయంలో, జనసేన పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ తెరపైకి తెచ్చిన ‘పావు’గా మాత్రమే ముద్రగడ పద్మనాభ రెడ్డిని చూడాల్సి వుంటుంది. తండ్రి తీరు నచ్చక, ముద్రగడ కుమార్తె కూడా తన దారి తాను చూసుకున్నారు రాజకీయంగా.
జనసేనను పదే పదే ముద్రగడ టార్గెట్ చేసినా, ముద్రగడపై ఎప్పుడూ విమర్శలు చేయలేదు జనసేనాని పవన్ కళ్యాణ్. పైగా, పార్టీ శ్రేణుల్ని కూడా వారించారు జనసేనాని. ఇక, టీడీపీ అయితే ముద్రగడ పద్మనాభంని పెద్దగా పట్టించుకుంటున్న పరిస్థితీ లేదు.
వాస్తవానికి, ముద్రగడ రాజకీయాలపై ఎప్పుడో పట్టు కోల్పోయారు. కాపు రిజర్వేషన్లంటూ కొన్నేళ్ళ క్రితం వైసీపీ నడిపిన పెయిడ్ పోరాటంలో, ముద్రగడ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తునిలో రత్నాచల్ రైలు దహనం.. వైసీపీ, ముద్రగడ కాపు ఉద్యమం ముసుగులో చేసిన దారుణం.. అని అంటుంటారు.
ఇక, ఇప్పుడు ముద్రగడపై హత్యాయత్నమంటూ వైసీపీ తెరపైకి తెచ్చిన ‘దాడి’ నాటకం వెనుక కూడా చాలా అనుమానాలున్నాయన్నది స్థానికుల మాట. మతి స్థిమితం లేని వ్యక్తితో వైసీపీనే, ఈ దాడి చేయించి వుండొచ్చన్నది కొందరి అభిప్రాయం. ఇంకొందరేమో, సదరు వ్యక్తితో మద్యం తాగించి, దారుణానికి వైసీపీ నాయకులే తెగబడ్డారన్నది మరికొందరి ఆరోపణ.
జనంలోకి జనసేన.. అంటూ జనసేన ముఖ్య నేత నాగబాబు, పుంగనూరులో బహిరంగ సభ నిర్వహించగా, అదే రోజు ముద్రగడ వ్యవహారం తెరపైకి రావడమంటే.. ఖచ్చితంగా ఇందులో వైసీపీ కుట్ర వుండి వుండాలన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అనుమానం.
అయినా, ఈ తరహా పాత చింతకాయ పచ్చడి లాంటి శవ రాజకీయాల్ని నమ్ముకుంటే, వైసీపీకి మిగిలేది బూడిద మాత్రమే. ఇవే రాజకీయాలు చేసి 151 నుంచి 11కి పడిపోయింది వైసీపీ.!