వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య తిరుమలని టార్గెట్‌గా చేసుకుని సరికొత్త రాజకీయానికి తెరలేపింది. తమ హయాంలో టీటీడీని భ్రష్టు పట్టించేందుకు వైసీపీ చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన ‘లడ్డూ’ విషయంలో వైసీపీ హయాంలో నడిచిన కల్తీ వ్యవహారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అన్న ప్రసాదం నాణ్యత కూడా వైసీపీ హయాంలో దారుణంగా దెబ్బ తింది. క్యూ లైన్లలో భక్తులకు అందించే పాలు, అన్న ప్రసాదం.. వీటి విషయంలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయ విమర్శలు కాదు, సాక్షాత్తూ భక్తులే, అప్పట్లో టీటీడీ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాల్ని చూశాం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ‘జగన్ మోహన్ రెడ్డి రక్షక గోవిందా’ అంటూ గోవింద నామాల్ని మార్చి చెప్పిన ఘనత అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణిది. చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి బోల్డన్ని.
ఈ కారణంగానే, వెంకటేశ్వర స్వామి భక్తులు, గత ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పారు. ప్రభుత్వం మారితే తప్ప, టీటీడీ తీరు మారదని భక్తులు అప్పట్లో నినదించడం చూశాం. అలాంటి వైసీపీ, ఇప్పుడు టీటీడీ మీద విషం చిమ్ముతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
టీటీడీ నిర్వహణలోని గోశాలలో ఆవులు చనిపోతున్నాయనీ, తిరుమల కొండ మీదకు మద్యం, నాన్ వెజ్ బిర్యానీ వంటివి వెళుతున్నాయనీ, అన్యమతస్తులు అక్రమ మార్గాల్లో వెళుతున్నారనీ.. వైసీపీ ఆరోపిస్తోంది. ఆరోపణలు మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారమూ చేస్తోంది.
ఓ వైపు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటేసి, ఇంకోపక్క తిరుమల కొండపై వైసీపీ దుష్ప్రచారానికి తెరలేపడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమైనా వుందా.? తిరుమల విషయంలో వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. కంట్రోల్ చేసుకోలేని స్థాయిలో డ్యామేజ్ జరిగిపోయిందని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు.
‘ఇప్పుడిది డిజాస్టర్.. ఇక కోలుకోలేం’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొందరు, వైసీపీ అధినాయకత్వాన్ని ట్యాగ్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారు.
