దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూశాం. ‘దొంగే, దొంగా దొంగా’ అని అరచినట్లుంది.. అనేది ఓ సామెత.! వైసీపీ వ్యవహారం ఇలానే వుందా.?
ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ పోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ‘సీజ్ ది ఫైర్’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్‌పై నినదించాక.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
కాకినాడ పోర్టే ఎందుకు.? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. ఇంత దారుణమైన అవినీతి, దోపిడీ వైసీపీ హయాంలో జరిగిందా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 48 వేల కోట్ల రూపాయలు.. అంతకు మించిన అవినీతికి కాకినాడ పోర్టు ముఖ‘ద్వారం’గా మారిన వైనంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు కూడా. పేదోడి కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం, అక్రమార్కుల జేబుల్లోకి వేల కోట్ల రూపాయల రూపంలో ఎలా వెళ్ళాయనే చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం దొంగల్ని వదలొద్దని రాష్ట్ర ప్రజానీకం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద కుంభకోణంపై ప్రత్యేక సిట్‌ని కూడా చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసింది.
అసలంటూ, రేషన్ బియ్యం.. పేదోళ్ళ ఇళ్ళకు చేరకుండా, టన్నుల లెక్కన విదేశాలకు ఎలా అక్రమ మార్గంలో ఎగుమతవుతోందో లెక్కలు తీయాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ మీద వుంది. ఇంటి వద్దకే రేషన్.. అంటూ ఏర్పాటు చేసిన వాహనాలే ఈ అవినీతికి కారణమంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న సంగతి తెలిసిందే.
కాకినాడ పోర్టు వేదికగా బియ్యం స్మగ్లింగ్ నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు ఏకంగా పోర్టునే కాజేసేందుకు వైసీపీ పన్నిన కుట్రలు మరింత విస్మయానికి గురిచేస్తున్నాయి. పోర్టు మొత్తం వైసీపీ గుప్పిట్లో వుందని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుని సందర్శించిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
కేవీ రావు, జీఎంఆర్.. కాకినాడ పోర్టులో భాగస్వామ్యం కలిగి వుండగా, వాళ్ళని భయపెట్టి వైసీపీ పెద్దలు తమ పేరున, వాటాల్ని రాయించుకున్నారు. ఈ కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు, కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. తప్పు చేయడం, ముందస్తు బెయిల్ సంపాదించి తప్పించుకోవడం.. ఇది వైసీపీ మార్కు వ్యవహారం. చాలా కేసుల్లో వైసీపీ నేతలు ఇలానే తప్పించుకుంటున్నారన్న విమర్శ వుంది.
ఇదిలా వుంటే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సెజ్ భూముల్ని అక్రమ మార్గంలో సొంతం చేసుకున్న అంశం వెలుగులోకి వచ్చింది. ‘నా దగ్గర డబ్బులున్నాయ్.. నేను కొనుక్కున్నాను..’ అని నిస్సిగ్గుగా చెబుతున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ హయాంలో వైసీపీ నేతలు ఎలా భూముల్ని కొన్నారన్నది బహిరంగ రహస్యమే. బెదిరించడం, తక్కువ ధరలకే భూముల్ని కొట్టేయడం.. వైసీపీ మార్కు భూ దందా.
ఏదిఏమైనా, కేవలం ఆరోపణలకే పరిమితమైపోతే కుదరదు.! చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్, పోర్టు దొంగల్ని కటకటాల వెనక్కి పంపించడమే కాదు, దోపిడీకి గురైన ప్రజాధనాన్ని ఆ దోపిడీ దొంగల నుంచే తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేసేలా చర్యలు చేపట్టాల్సి వుంటుంది. మరీ ముఖ్యంగా సమీప భవిష్యత్తులో రేషన్ స్మగ్లింగ్‌కి ఎవరూ తెగబడకుండా కఠినమైన శిక్షలు పడేలా చేయగలగాలి.