వైసీపీ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు ఏ మాత్రం గ్రాఫ్ పెంచట్లేదు. ఇంకా చెప్పాలంటే ఉన్న ఇమేజ్ ను కూడా తగ్గిస్తున్నాయి. అప్పట్లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే దాన్ని కూటమి ప్రభుత్వం ఏ రేంజ్ లో వాడుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కూడా వారికి ధైర్యం లేదంటూ ప్రచారం చేసింది. ప్రజల్లో కూడా వైసీపీ పట్ల అభిమానం సన్నగిల్లింది. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి పనే చేస్తున్నారు. గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది వైసీపీ పార్టీ.
ఎందుకు అంటే.. ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లేసే అవకాశం లేదని చెబుతున్నారు. పైగా తాము సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కూడా కూటమి దాన్ని తీసుకోలేకపోతుందంటూ చెప్పుకొచ్చారు. అసలు ఇలాంటి కారణాలతో ఎవరైనా ఎన్నికలను బహిష్కరిస్తారా అంటూ కామెంట్లు వస్తున్నాయి. పోటీలోకి దిగి.. కూటమి ఇలా అరాచకాలు చేస్తోంది అంటూ చూపిస్తే అప్పుడు ప్రజల చూపు ఆటోమేటిక్ గా వాళ్ల మీదకు వెళ్తుంది కదా. యుద్ధం చేయకుండా ఆరోపణలు చేస్తే ఎవరూ నమ్మరు. యుద్ధంలోకి దిగి ఓడినా సరే ప్రజల కోసమే అన్నట్టు ప్రవర్తిస్తే ఆటోమేటిక్ గా వారికి గుర్తింపు ఉంటుంది.
యుద్ధంలో ఓడిపోయినా గుర్తింపు ఉంటుంది గానీ.. యుద్ధం అంటే భయపడి పారిపోయేవారికి అసలు గుర్తింపు కాదు కదా.. తిట్టడం మాత్రమే మిగులుతుంది. వైసీపీ ఎన్నికలంటే భయపడి పారిపోయింది అనే ప్రచారం అప్పుడే మొదలైంది. మరి ఈ విషయాన్ని వైసీపీ ఎందుకు మర్చిపోతుందో అర్థం కావట్లేదు.