వై నాట్ 175 అనే నినాదాన్ని నిజానికి, వైసీపీ శ్రేణులే నమ్మలేదు. అప్పటి వైసీపీ సిట్టింగ్ ప్రజా ప్రతినిథులూ నమ్మలేదు. కానీ, సాధ్యం కాని విషయాన్ని బలంగా రుద్దేందుకోసం ‘సిద్ధం’ అంటూ కోట్లు ఖర్చు చేసి నానా హంగామా సృష్టించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
చివరికి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ.! కనీసం డజను సీట్లు కూడా సాధించలేక బొక్క బోర్లా పడ్డ వైసీపీ, వచ్చే ఐదేళ్ళు ఎలా మనుగడ సాధిస్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు బెంగళూరుకి జంప్ అయిపోయారు.
పార్టీ ముఖ్య నేతలకే వైఎస్ జగన్ అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలున్నాయి. పొద్దున్న లేస్తే మీడియా ముందర కనిపించే సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా గాయబ్.! ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్నికల సమయంలో ప్రకటించి, తన వారసుడ్ని రాజకీయాలకు పరిచయం చేసిన పేర్ని నాని, తన వారసుడు కిట్టు కూడా ఓడిపోయేసరికి, చేసేది లేక.. తిరిగి రాజకీయ తెరపై హంగామా చేయాలని చూస్తున్నారు.
ఒకరిద్దరు వైసీపీ నేతలు (వాళ్ళు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో..) మీడియా ముందుకు వస్తున్నారు తప్ప, వైసీపీ ముఖ్య నేతలనదగ్గవారంతా అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోయినట్లే కనిపిస్తోంది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ మాత్రం షరామామూలుగానే కామెడీ చేసుకుంటూ వెళుతోంది.
వున్నంతలో విజయ సాయి రెడ్డి కాస్త హడావిడి చేస్తోంటే, అది కూడా నవ్వులపాలవుతోంది. అసలు విజయ సాయి రెడ్డి ఎవరి మీద ‘యుద్ధం’ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మీడియా మీద గుస్సా అవుతున్నారు.. కుల మీడియా అంటూ గగ్గోలు పెడుతున్నారు తప్ప, తన మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన మదన్ మోహన్ అనే వ్యక్తి మీద మాత్రం పరువు నష్టం దావా వేయలేకపోతున్నారు విజయ సాయిరెడ్డి.
ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారన్నది విజయ సాయి రెడ్డి మీద ఆరోపణ. ఆరోపణ చేసింది కూడా సదరు మహిళకు భర్త అయిన మదన్ మోహన్. ఆ మహిళ వైసీపీ హయాంలో దేవాదాయ శాఖలో కీలక అధికారిగా పని చేశారు.
ఇదిలా వుంటే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కావొచ్చు, మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కావొచ్చు, ఇంకో మాజీ మంత్రి రోజా కావొచ్చు.. ఇలాంటోళ్ళు పెద్దగా మీడియా ముందు కనిపించకపోవడం, వైసీపీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తోంది.
వాళ్ళని వదిలేసుకో జగనన్నా.. వీళ్ళని వదిలేసుకో జగనన్నా.. వీళ్ళ వల్లనే పార్టీ నాశనమైపోయింది జగనన్నా.. అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు, ‘నిఖార్సయిన వైసీపీ అభిమానులు’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు.
గ్రామాల్లో వైసీపీ జెండా పట్టుకోవడానికి కూడా కార్యకర్తలు లేని పరిస్థితి వైసీపీకి ఇప్పుడెందుకు వచ్చింది.? అంటే, పోలింగ్ జరిగాక కూడా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ‘150కి పైగా సీట్లలో గెలుస్తాం’ అని చేసిన ప్రకటన, ఈ క్రమంలో నడిచిన బెట్టింగులు, ఆ బెట్టింగుల్లో సర్వనాశనమైపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఇదీ అసలు విషయం.
అధినేత వైఎస్ జగన్, విరివిగా బెంగళూరుకి వెళ్ళిపోతోంటే, నేతలైనా.. కార్యకర్తలైనా.. పార్టీ వెంట ఎందుకు వుంటారు.? టీడీపీ, జనసేన, బీజేపీ సరిగ్గా పోకస్ పెడితే, పదకొండు రోజులు కూడా అవసరం వుండదు, వైసీపీ సింగిల్ సీటుకి పడిపోవడానికి.. అని వైసీపీ శ్రేణులే సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. అంతలా పతనైపోయింది వైసీపీ.