ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో కల్లు గీత కార్మికులకు 10% దుకాణాలను కేటాయించిన విషయం తెలిసిందే. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 35 పిటిషన్లు హైకోర్టులో దాఖలు అయ్యాయి. వైసీపీ న్యాయవాదులు, తమ సానుభూతిపరులతో ఈ పిటిషన్లు దాఖలు చేయించిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పిటిషన్లు వేసిన వారిలో కొవ్వూరి వీఆర్ రెడ్డి, పరమేశ్వర్ రావు, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కాగా, రఘువీర్, మనోహర్ రెడ్డి, శ్రీమన్నారాయణ, రత్నాంగ ఫణి రెడ్డి తదితరులు వైసిపి సానుభూతి పరులు. ఇక పిటిషన్ దాఖలు చేసిన వారిలో కిరణ్ తిరుమల శెట్టి అనే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ లీగల్ అడ్వైజర్ గా ఉన్నారు. ఐశ్వర్య నాగుల వైసీపీ లీగల్ సెల్ లో కీలక మహిళ నేత. వీరితోపాటు వైసీపీ పెద్దల అనుచరులు కూడా పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉండటంతో టీడీపీ నాయకులు చేసిన వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
తమపై మొదటి నుంచి వైసీపీ పక్షపాత ధోరణి చూపిస్తోందని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తమకు కేటాయించిన మద్యం షాపులనూ అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తమకు 20 శాతం రిజర్వేషన్ ఉండగా.. చంద్రబాబు వచ్చాక దానిని 34% చేశారు. అయితే గత ప్రభుత్వంలో రిజర్వేషన్ శాతాన్ని 24 శాతానికి కుదించారని అంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేల కల్లు దుకాణాలు మూతపడటం తమపై ఆ పార్టీ చూపిస్తున్న పక్షపాత ధోరణికి సాక్ష్యాలని ఆరోపిస్తున్నారు.