YS Avinash Reddy: ఎన్నెన్ని ఆరోపణలు.! ఎంతెంత వక్రీకరణ.! మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ తన మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డికి షాక్ తగిలింది.
కేసు దర్యాప్తు కొనసాగించవచ్చనీ, అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా నిలువరించలేమనీ తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని హైకోర్టు తేల్చి చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మద్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా, వివేకా హత్యకు సంబంధించి తాను ఎలాంటి నేరంలోనూ పాల్గొనలేదనీ, తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విషయం విదితమే.
వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కుమార్తె, అల్లుడు చంపించేసి వుండొచ్చనీ, ఆస్తి తగాదాల నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్య జరిగి వుంటుందని అవినాష్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అది కూడా సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవడం దగ్గర్నుంచే ఈ వింత ప్రచారానికి తెరలేచింది.
అసలు వైఎస్ వివేకానందరెడ్డి హిందువో, క్రిస్టియనో కాదనీ.. ఆయన మతం మార్చేసుకున్నారని కూడా అవినాష్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు, అసలు వైఎస్ వివేకానందరెడ్డి పేరు కూడా మారిపోయిందని చెబుతూ, షేక్ మొహమ్మద్ అక్బర్.. అంటూ కొత్త పేరు కూడా తెరపైకి తెచ్చారు అవినాష్ రెడ్డి.
అంతకు ముందు వరకూ అవినాష్ రెడ్డి, వివేకానందరెడ్డి.. తనకు రెండు కళ్ళు.. అని వైఎస్ జగన్ చెబుతూ వచ్చారు. ఓ కన్ను ఇంకో కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది.? అని కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్, అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. అందుకు భిన్నంగా వైసీపీ నేతలే, వివేకానందరెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు, మత మార్పిడి అంశాన్నీ తెరపైకి తీసుకురావడం గమనార్హం.