కొన్నాళ్ళ క్రితం కారు ప్రమాదం జరిగింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నారు వైఎస్ విజయమ్మ. వైసీపీకి ఆమె దూరమైన సమయంలో జరిగింది ఆ రోడ్డు ప్రమాదం. అప్పటికే ఆస్తుల వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి.. జగన్ – విజయమ్మ – షర్మిల మధ్య.
కొత్త కారు ప్రమాదానికి గురైంది. కొత్త టైర్లు రోడ్డు మీద పేలిపోయాయ్. ఎలాంటి గాయాలూ లేకుండా విజయమ్మ ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దాంతో, సహజంగానే ‘కుట్ర కోణం’ ఆరోపణలు తెరపైకొచ్చాయి. ఆస్తుల పంపకాల గొడవలు, ఆపై రాజకీయ పరమైన వివాదాలు.. కుటుంబంలోనే వుండడం.. అంతకు ముందే వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురవడంతో.. ఆరోపణలు రావడంలో వింతేముంది.?
తాజాగా మరింత ముదిరిపడ్డ ఆస్తుల పంపకాల వివాదాల నేపథ్యంలో ఆనాటి రోడ్డు ప్రమాద ఘటన మీద మరింత ఫోకస్ ఎక్కువైంది తెలుగు ప్రజలకి. రాజకీయ ప్రత్యర్థులు ఊరుకుంటారా.? ఈ విషయాన్ని మరింత హైలైట్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై విజయమ్మ ఓ లేఖ విడుదల చేసినట్లు వైసీపీ, తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ప్రకటించింది. అంతలోనే, ఆ ట్వీట్‌ని డిలీట్ చేసేశారు. దాంతో, అనుమానాలు ఇంకాస్త ముదిరాయి.
ఈ క్రమంలోనే విజయమ్మ ఓ వీడియోలో కనిపించారు. ‘కారు ప్రమాదాన్ని కుటుంబంలో ఆస్తుల పంపకాలతో ముడిపెట్టడం సబబు కాదు.. నా కొడుకు, నా కూతురు.. ఉత్తమోత్తములు..’ అన్నట్లుగా విజయమ్మ ఆ వీడియోలో సెలవిచ్చారు. అంత ఉత్తములైతే ఈ ఆస్తుల పంపకాల గోలేంటి.?
ఇక, పరువు నష్టం దావా వేస్తానంటూ వైఎస్ విజయమ్మ హెచ్చరించేశారు ఆ వీడియోలో.! ఎవరి మీద పరువు నష్టం దావా వేస్తారు విజయమ్మ.?
వైఎస్ షర్మిల అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదంటూ వైసీపీకి చెందిన ఓ నాయకుడు (ఎమ్మెల్యేగా వున్నపుడు) అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు కదా.. ఆయన మీద వైఎస్ విజయమ్మ పరువు నష్టం దావా వేయగలరా.?
‘వైఎస్ విజయమ్మ విచక్షణ కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారు..’ అంటూ ఆస్తుల పంపకాల వివాదంపై వైసీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటన వచ్చిన దరిమిలా, వైసీపీ మీద విజయమ్మ పరువు నష్టం దావా వేయగలరా.?
తన కుమారుడి పెళ్ళికి వైఎస్ షర్మిల, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిని ఆహ్వానించడానికి వెళితే, ఆ సమయంలో ఆమె కట్టుకున్న చీర రంగు మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వైఎస్ విజయమ్మ ఓ తల్లిగా పరువు నష్టం దావా వేయగలరా.?
వీడియో మొత్తం.. కట్ అండ్ పేస్ట్ వ్యవహారంలాగానే కనిపిస్తోంది. అయినా, వైఎస్ విజయమ్మకి విచక్షణ లోపించిందని ప్రకటించాక, వైసీపీ.. ఇప్పుడు విజయమ్మ వీడియోను ముందుకు తీసుకొచ్చి, ఆమెతో పరువు నష్టం హెచ్చరికలు జారీ చేయిస్తే.. అదేమన్నా సబబుగా వుందా.?
జగన్ మీద షర్మిల రాజకీయ విమర్శలు.. ఆస్తుల పంపకాల వివాదాల్లో కుమార్తె తరఫున నిలబడ్డ వైఎస్ విజయమ్మ.. రాజకీయాల్లో తన కుమార్తెకే తన మద్దతు.. అని గతంలో ప్రకటించిన వైఎస్ విజయమ్మ.. ఇప్పుడేమో, ఈ వీడియోలో కుమారుడికీ మద్దతుగా మాట్లాడటం చూస్తోంటే.. అంతా అయోమయంగానే కనిపిస్తోంది.! ఎందుకింత అయోమయం.? ఎందుకీ సెల్ఫ్ గోల్ వీడియో.?