‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మనకు పనేంటి.?’ అని వైఎస్ విజయమ్మ ప్రశ్నిస్తే, దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే, అది వారి కుటుంబ వ్యవహారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి వైదొలగి, మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కి గుడ్ బై చెప్పేసి, వైఎస్ విజయమ్మ తెలంగాణలో సెటిలైపోయారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనుకుంటున్నారు. ఇందులో ఆమెను పూర్తిగా తప్పు పట్టేయాల్సిన పనిలేదు.
కానీ, ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనకి పనేంటి.?’ అని వైఎస్ విజయమ్మ అనడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల నియోజకవర్గమే వైఎస్ విజయమ్మను అసెంబ్లీకి పంపింది. ఆ విషయాన్ని ఆమె మర్చిపోతే ఎలా.?
ఆ పులివెందుల ఎమ్మెల్యేగా వున్నప్పుడే, ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అనగలిగారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన, తెలంగాణలో రాజకీయం మొదలు పెట్టాక, ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనకి పనేంటి.?’ అంటూ తెలంగాణలో మీడియాతో వైఎస్ విజయలక్ష్మి చాలా తేలిగ్గా మాట్లాడేశారు.
ఆనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ.? ఈనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులెక్కడ.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతే, తెలంగాణకు వెళ్ళడానికి వీసా తీసుకోవాలా.? అని ప్రశ్నించిన తెగవ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం తెలంగాణలో పార్టీని ఎత్తేసిన ఘన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.
కన్నతల్లిలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి, తెలంగాణలో రాజకీయాలు చేస్తూ, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌తో కొట్లాటకైనా సిద్ధమని చెప్పేంత ఘన చరిత్ర వైఎస్ షర్మిలది. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్‌తో పనేంటి.? అని ప్రశ్నించగలిగిన మాటకారితనం వైఎస్ విజయలక్ష్మిది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మనకు పనేంటి.? అని ప్రశ్నిస్తూనే, అన్న వైఎస్ జగన్ కోసం చెల్లెలు షర్మిల.. చెల్లెలు వైఎస్ షర్మిల కోసం అన్న వైఎస్ జగన్.. ఒకరికొకరు అండగా వుంటారని వైఎస్ విజయమ్మ చెబుతున్నారంటే.. ఈ కుటుంబ రాజకీయాన్ని ప్రజలే సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రజలెలా పోయినాగానీ, వైఎస్ కుటుంబానికి అధికారం వుండాలి. అదీ రాజకీయమంటే.! ఇవన్నీ చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభించకుండా వుంటుందా.?