తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటూ ఆమె చెప్పుకొచ్చారు. నేడు మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్థంతి సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి సునీత, కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. తన తండ్రి హత్య కేసులో స్పీడ్ గా విచారణ సాగట్లేదని.. నేరస్తులకు శిక్ష పడట్లేదని వాపోయారు.
ఈ కేసులో సాక్ష్యులు చనిపోవడంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. సాక్ష్యులను ప్రభుత్వం కాపాడాలని.. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా నిందితులకు శిక్షలు విధించాలంటూ ఆమె కోరారు. నిందితులు డబ్బు, పలుకుబడితో సాక్ష్యులను ప్రేరేపిస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. సీబీఐ విచారణ ఇంకా వేగం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నా సరే నిందితులకు ఇంకా శిక్షలు పడకపోవడం చాలా బాధాకరం అని ఆమె చెప్పుకొచ్చారు. వివేకానందరెడ్డి ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని.. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆమె గుర్తు చేసుకున్నారు.
సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు కూడా వివేకా సమాధి వద్ద నివాళి అర్పించారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్షలు విధించినప్పుడే తన తండ్రికి అసలైన ఆత్మశాంతి కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఆరేళ్ల కాలంలో తనపై ఎంతో మంది ఒత్తిడి చేసినా వెనకడుగు వేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినా కూడా కేసులో ఇంకా నిజాలు తేలకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోందన్నారు. తాను ఏ పార్టీకి మద్దతు పలకట్లేదని.. తండ్రికి న్యాయం జరిగితే అదే చాలు అంటూ తెలిపారు. సునీత ఇప్పటికే రెండు సార్లు సీఎం చంద్రబాబును కలిశారు.
తండ్రి హత్య కేసులో నిజాలు తేల్చాలంటూ కోరారు. కూటమి ప్రభుత్వం కూడా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేసింది. అలాగే సునీత కుటుంబానికి రక్షణ కల్పిస్తామంటూ కూడా చెప్పింది. సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్వయంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో కడప రాజకీయాల్లో వివేకా హత్య చాలా ప్రభావం చూపించింది. మరి ఈ కేసులో ఇంకా ఎంత మంది అరెస్ట్ అవుతారో చూడాలి.