తనకు ప్రాణ హాని వుందంటూ పీసీసీ అధ్యక్షురాలు (ఆంధ్రప్రదేశ్) వైఎస్ షర్మిల రెడ్డి, పోలీసులను ఆశ్రయించారట. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిలకు భద్రత ఇస్తామని కూడా ప్రకటించారు.
‘ఆమె మమ్మల్ని రాజకీయంగా విమర్శిస్తుండొచ్చు. కానీ, ప్రాణ హాని వుందని ప్రకటించిన దరిమిలా, ఆమెకు రక్షణ కల్పిస్తాం..’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘తోడ బుట్టిన అన్న నుంచి ప్రాణ హాని వుందని వైఎస్ షర్మిల పోలీసులను ఆశ్రయించారు..’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించడం గమనార్హం.
గత కొంతకాలంగా అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డికి ఆస్తి పంపకాల్లో గొడవలున్నాయి. దానికి తోడు రాజకీయంగా కూడా ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి. ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, వైఎస్ షర్మిలారెడ్డిని పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో ఆమె ఏపీ రాజకీయాల్ని వదిలి, తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవడం, సొంత పార్టీని పెట్టి, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం, తిరిగి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవడం తెలిసిన విషయాలే.
రాయలసీమలో వైసీపీ దారుణంగా దెబ్బ తినడానికి వైఎస్ షర్మిల కూడా ఓ కారణమని వైఎస్ జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇంకోపక్క, షర్మిలకు గతంలో ఇచ్చిన ఆస్తుల్ని (వ్యాపారంలో వాటాల్ని) వెనక్కి తీసుకోవడానికి వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించారు కూడా.
ఈ పంపకాల పంచాయితీ నడుస్తున్న సమయంలోనే వైఎస్ షర్మిల, తనకు ప్రాణహాని వుందని, అన్న జగన్ నుంచే ఆ ప్రాణ హాని వుందని ప్రకటించడం గమనార్హం. గతంలో వైఎస్ విజయమ్మ, ఎన్నికల సమయంలో తనకు ప్రాణ హాని వుందని, విదేశాలకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.