వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) తన పిల్లలకు ఆస్తి పంపకాలు చేశారు. ఈరోజు కడప జిల్లాలోని వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్లిన షర్మిల.. తన పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులను పిల్లల పేర్ల మీదకు బదిలాయించారు. ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని కుమారుడు రాజారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. మరో 2 ఎకరాల 12 సెంట్ల భూమిని కుమార్తె అంజలి పేరు మీద రాశారు. అక్కడే ఉన్న నిమ్మ తోట ని సైతం షర్మిల తన కుమార్తెకి అప్పజెప్పారు.
ఈరోజు హైదరాబాద్ నుంచి కడపకు ప్రత్యేక విమానంలో వచ్చిన షర్మిల.. అక్కడి నుంచి వేంపల్లి లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసిన డాక్యుమెంట్ల పై షర్మిల తన పిల్లలతో సంతకాలు చేయించారు. తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయనున్నారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆస్తుల వివరాలు వెల్లడించాలి. కాబట్టి ముందు జాగ్రత్తగా షర్మిల పిల్లలకు ఆస్తిపంచి ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు శనివారం దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు షర్మిల ఇడుపులపాయ కి వెళ్లారు. పనిలో పనిగా ఆస్తులు పంపకాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.