బెంగళూరు నుంచి విజయవాడ.. విజయవాడ నుంచి బెంగళూరు.. షటిల్ సర్వీస్ చేస్తున్నారు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ వారం కూడా ఆయన ఆంధ్ర ప్రదేశ్‌కి వచ్చేసి, కొన్ని రోజులు (రెండు మూడు రోజులు) ఏపీలోనే వుండి, మళ్లీ బెంగళూరుకి వెళతారు.
ఈ దఫా ఏపీ పర్యటనలో వైఎస్ జగన్, విజయవాడలోని ఓ ఆసుపత్రిలో ‘పరామర్శ కార్యక్రమం’ చూసుకుని, ఆ తర్వాత నంద్యాల వెళతారట. ఇంతకీ, ఈ పర్యటనలో వైఎస్ జగన్, సొంత నియోజకవర్గం పులివెందులకు వెళతారా.?
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి కూడా వైఎస్ జగన్ హాజరు కాలేదు. గవర్నర్ ప్రసంగం రోజున హడావిడి చేసి, అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు వైఎస్ జగన్. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ ఇలానే చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే తీరిక వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేకపోయినా, ఆయన మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా వైఎస్ జగన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
బెంగళూరు – విజయవాడ మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ, ఈ క్రమంలో ఏపీలో వున్నప్పుడు, తన క్యాంప్ కార్యాలయంలో ఓసారి మీడియాతో కూడా మాట్లాడారు.. అదీ పోలవరం ప్రాజెక్టు గురించి. పార్టీ కార్యకర్తలు, నేతలతో భేటీ కోసం కొంత సమయం కేటాయిస్తున్నారు.
పనిలో పనిగా, ఏపీలోని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మీద దుష్ప్రచారం చేయాలంటూ పార్టీ శ్రేణులకు ‘నూరిపోస్తున్నారు’ వైఎస్ జగన్, ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు.
ముఖ్యమంత్రి పదవిలో వున్నప్పుడు, రాజకీయ ప్రత్యర్థులపై ‘వీకెండ్ పొలిటీషియన్స్..’ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసిన వైఎస్ జగన్, ‘అలాంటోళ్ళు నాయకులుగా వుండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం..’ అని కూడా సెలవిచ్చారు.
ఆ లెక్కన, విజయవాడ – బెంగళూరు మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్న జగన్ కూడా రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమనే అనుకోవాలేమో.!