రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు, ప్రధానంగా.. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో వున్న రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
పలువురు ముఖ్యమంత్రులూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఆ లిస్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందు వరుసలో వున్నారు. సమర్థులైన రాష్ట్ర అధికారుల్ని కేంద్రం తీసుకెళ్ళిపోతే, రాష్ట్రంలో పరిపాలన దెబ్బతింటుంది.. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంలో భాగంగానే ఈ ఆలోచన.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తీవ్రంగా కేంద్ర నిర్ణయాన్ని తప్పు పడుతున్న సంగతి తెలిసిందే.
అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాదన వేరేలా వుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. అయితే, రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులకు పిలిచే క్రమంలో రాష్ట్రాలు ఇచ్చే ఎన్‌వోసీ పద్ధతిని కొనసాగించాలని లేఖలో కోరారు సీఎం వైఎస్ జగన్.
రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా.. సమర్థత గల అధికారులు అవసరమే. రాష్ట్రాల నుంచి సమర్థులైన అధికారుల్ని కేంద్రం బలవంతంగా తీసుకోవాలనుకోవడం సమర్థనీయం కాదు. ఈ క్రమంలో కేవలం రాష్ట్రాలకు కేవలం ఎన్‌వోసీ అనే హక్కు వుంటే సరిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరడంలో అర్థమే లేదు. అసలు ఆ ప్రతిపాదనను కేంద్రం లెక్క చేస్తుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.