అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి ‘హోదా’ లేదు.!
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులవుతుంది. ఇంతవరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలూ కూటమి ప్రభుత్వం నుంచి లేవు, వుండకూడదు కూడా.!
గతంలో నమోదైన కేసులకు సంబందించి వైసీపీ నేతలు కొందరు అరెస్టవుతున్నారు, కొందరికి బెయిల్ దొరుకుతోంది. కేసుల తీవ్రత దృష్ట్యా, బెయిల్ – జెయిల్ వ్యవహరాల్ని న్యాయస్థానం చూసుకుంటుంది.
ఎన్నికల్లో ఓడిపోయాక, రాష్ట్రంతో తనకేంటి సంబంధం.? అనుకుంటున్నారో ఏమో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకే పరిమితమవుతున్నారు. అప్పుడప్పుడూ వచ్చి, కూటమి ప్రభుత్వం మీద ఏవేవో విమర్శలు చేసేసి, మళ్ళీ వెళ్ళిపోతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే, తప్పనిసరై రాష్ట్రానికి వచ్చిపోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అయిష్టంగానే ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులోంచి కొన్ని ఆణిముత్యాల్ని చదివేసి, తన పనైపోయిందనుకుని, తిరుగుటపాలో బెంగళూరుకి చెక్కేస్తున్నారన్నమాట.
వైసీపీ నేత నందిగం సురేష్, ఓ కేసులో అరెస్టయి జైల్లో వుంటే, ఆయన్ని పరామర్శించడానికి వచ్చారు వైఎస్ జగన్ తాజాగా. ఈ క్రమంలో ‘లేని బీపీని’ తెచ్చేసుకుని, ఆవేశంతో ఊగిపోయి, ఐదేళ్ళ తర్వాత అందర్నీ జైల్లో పెట్టించేస్తా.. అంటూ కూటమి పార్టీలకు హెచ్చరికలు పంపేశారు.
జగన్ పక్కనున్నవాళ్ళే ఆయన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఐదేళ్ళ వరకూ కాదు, కూటమి ప్రభుత్వం సరిగ్గా ఫోకస్ పెడితే, వైఎస్ జగన్ తిరిగి బెంగళూరుకి వెళ్ళడం కాదు, జైలుకే వెళ్ళాల్సి వస్తుందేమో.! అప్పట్లో ప్రతిపక్ష నేత హోదా వున్న చంద్రబాబుని జగన్ అరెస్టు చేయించారు. దానికి చంద్రబాబు బదులు తీర్చుకోవాలనుకుంటే, జగన్ ఇలా విజయవాడ – బెంగళూరు షటిల్ సర్వీస్ చేసే అవకాశం వుండదు కదా.?