వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనకిచ్చిన స్క్రిప్టుని అర్థం చేసుకుని మాట్లాడతారో, అర్థం చేసుకోకుండానే చదివేస్తారో.. వైసీపీ శ్రేణులకే అర్థం కాని వ్యవహారం.!
అధికారంలోకి వచ్చింది మొదలు, మీడియాని ఫేస్ చేయడానికి వైఎస్ జగన్ నానా తంటాలూ పడ్డారు. రాసిచ్చిన స్క్రిప్టుల్ని సరిగ్గా చదవలేక, ట్రోల్స్ అలాగే మీమ్స్‌కి బోల్డంత కంటెంట్ ఇచ్చేశారు వైఎస్ జగన్
మోహన్ రెడ్డి. ఐదేళ్ళ ‘అధికారం’ అటకెక్కిపోయిందిప్పుడు. ఆయన జస్ట్ ఎమ్మెల్యే అంతే.!
మామూలుగా అయితే, ఓటమికి కారణాల్ని వెతుక్కోవాలి.. పోస్టుమార్టమ్ జరగాలి.. తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది మానేసి, ‘మోసపోయాం’ అంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. ‘ఆప్యాయతలు, అనురాగాలు ఏమైపోయాయో అర్థం కాలేదు’ అంటూ ప్రజల మీద నిందలు వేయడం మొదలు పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
ఇది చాలదన్నట్టు, ‘నేను చాలా నిజాయితీపరుడ్ని.. ముక్కుసూటి మనిషిని..’ అంటూ తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చేసుకున్నారు వైఎస్ జగన్.. అసెంబ్లీ సమావేశాల ముందర, పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ. దాంతో, వైసీపీ నేతలకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు.
వైఎస్ జగన్ నిజాయితీపరుడైతే, ఆయన మీద దాదాపు మూడు డజన్ల కేసులు, అవీ అక్రమాస్తులకు సంబంధించి చార్జిషిట్లు కూడా నమోదైన కేసులు ఎందుకుంటాయ్.? ముక్కుసూటి మనిషి అయితే, ముఖ్యమంత్రి హోదాలో మీడియాని ఫేస్ చేయడానికి ఎందుకంతలా ఐదేళ్ళపాటు నానా తంటాలూ పడ్డారు.?
వైసీపీ హయాంలో అదేదో రాజ్యాంగం నడిచినట్లు, వైసీపీ డిక్షనరీలో ‘నిజాయితీ, ముక్కుసూటితనం’ అనే మాటలకు వేరే అర్థాలున్నాయేమో.!